వేల్పూర్, సెప్టెంబర్ 12: దేశంలో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో కొత్తగా తొమ్మిది లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. మంత్రి వేముల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరాలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 5,500 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా, 4 వేల మందికిపైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో 1,236 మందికి కొలువులు లభించాయి. ఎంపికైన వారికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి నియామకపత్రా లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సంక్షేమం కోసం పనిచేశానని, ఇప్పుడు యు వతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ఇ లాంటి జాబ్‌మేళాలు నిరంతరం ఉంటాయని స్పష్టం చేశారు. తాను 1990లో 800 జీతానికి చేరానని, 1994లో 16 వేల జీతానికి చేరుకున్నానని, అప్పట్లో హైదరాబాద్‌లో అదే అత్యధిక జీతమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. ఇంత భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.