బాన్సువాడ, జూన్ 22: దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పింఛన్ పెంచాలని ఎవరు అడగకపోయినా దివ్యాంగుల బాధలను అర్థం చేసుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పడిస్తున్న రూ.3 వేల పింఛన్‌కు అదనంగా మరో వెయ్యి పెంచిన కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన దివ్యాంగుల తొలి ఆత్మీయ సమ్మేళనానికి బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ మినహా మిగతా రాష్ర్టాల్లో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ చాలా తక్కువ అన్నారు. కర్ణాటకలో రూ.600, మహారాష్ట్ర, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో వెయ్యి చొప్పున, యూపీ, రాజస్థాన్‌లో రూ.500 చొప్పున, కేరళలో రూ.1,400 ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.600 మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ కోసం ప్రతినెలా రూ.150 కోట్లు ఖర్చు చేసిందని, పెంచిన పింఛన్‌తో ఇక నుంచి నెలకు రూ.203 కోట్లు వెచ్చించనున్నదని చెప్పారు. పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచడంతో కొందరు అర్హత లేకపోయినా దివ్యాంగ పెన్షన్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచిది కాదని సూచించారు. సకలాంగులు వికలాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం ఇస్తున్న సహాయం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచినట్టు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. దివ్యాంగుల న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్పీకర్ పోచారం దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.