Kamareddy | నిజామాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తన మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. తన మాతృమూర్తి స్వగ్రామం ఉన్న కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. సోమవారం విడుదల చేసిన బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల జాబితాలో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నట్టు పేర్కొనడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది. కేసీఆర్ పూర్వీకులు ఈ నియోజకవర్గానికి చెందినవారే కావడం కూడా స్థానికుల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ మాతృమూర్తి వెంకటమ్మ స్వగ్రామం ప్రస్తుతం కామారెడ్డి నియోజకర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్ గ్రామం. ఎనిమిదిన్నర దశాబ్దాల తర్వాత కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి సై అనడంతో పూర్వీకుల గ్రామంతోపాటు నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలు మురిసిపోతున్నాయి.
కేసీఆర్ మాతృమూర్తి వెంకటమ్మ కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం పోసానిపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు. ఇప్పుడీ గ్రామాన్ని కోనాపూర్గా పిలుస్తున్నారు. కేసీఆర్ తండ్రి రాఘవరావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. పోసానిపల్లికి ఆయన ఇల్లరికం వచ్చారు. 80-85 ఏండ్ల కిందట కేసీఆర్ తల్లిదండ్రులు ఈ ప్రాంతంలో నివసించారు. సొంతింట్లోనే 1930 వరకు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అప్పర్ మానేరు డ్యాం నిర్మించడంతో పోసానిపల్లి గ్రామం అందులో మునిగిపోయింది. అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టేదాకా వారు ఇక్కడే ఉన్నారు. వారికి ఇక్కడే ఐదుగురు కూతుళ్లు జన్మించారు. మానేరు వాగు మీద అప్పర్ మానేరు డ్యాం కట్టాలని నిజాం రాజు నిర్ణయం తీసుకున్నప్పుడు చెరువు విస్తరణలో వందల ఎకరాలు మునిగిపోయాయి. 1940 దశకంలో కేసీఆర్ తల్లిదండ్రుల సాగు భూములు అందులోనే ముంపునకు గురయ్యాయి. దీంతో వారు పోసానిపల్లిని వదిలి సిద్దిపేట జిల్లాలోని చింతమండక గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారు. పరిహారంగా వచ్చిన డబ్బుతో భూములు కొనుగోలు చేసి, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు. 1954లో చింతమడకలో కేసీఆర్ జన్మించారు. ఇప్పటికీ కేసీఆర్ తల్లిగారి తరఫు వారు కోనాపూర్ (పోసానిపల్లి) గ్రామంలో నివాసం ఉంటున్నారు.
పూర్వీకుల మూలాలు ఉన్న ప్రాంతం నుంచి కేసీఆర్ పోటీ చేయనుండటంతో కామారెడ్డి నియోజకవర్గవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. బీబీపేట, కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు తదితర మండలాల్లో ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. కేసీఆర్ రాకతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురే ఉండదని సంబురాల్లో మునిగిపోయాయి. గులాబీ బాస్ బరిలోకి దిగుతుండటంతో విపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. ఐదారు జిల్లాల్లో ప్రభావం చూపనుండడంతో ప్రతిపక్ష నాయకులు ఆందోళనలో మునిగిపోయారు.
కేసీఆర్ సారు ఈడికి అస్తుండంటేనే సంతోషమైతాంది. ఈడ నుంచి పోటీ చేస్తుండడం మా అదృష్టం. కేసీఆర్ అధికారంలకు అచ్చినంకనే మాకు అన్ని సౌలత్లు అయినయ్. నీళ్ల తిప్పలు తప్పినయ్. రోడ్లు బాగుచేసిండ్రు. కన్న తల్లి పుట్టిన ఊరును మర్వకుండా వస్తున్న సారును మస్తు మెజార్టీతో గెలిపిస్తాం. మా ప్రాంతం ఇంక అభివృద్ధి అయితది. అన్నిట్ల దూసుకుపోతది.
– మొగిలి లింగం, కోనాపూర్ గ్రామస్తుడు