రేపు కొండగట్టుకు సీఎం కేసీఆర్
కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు.
- దాదాపు 3 గంటల పాటు గుట్టపైనే ఉండనున్న సీఎం
- స్వయంగా కోనేరు, బేతాళుడి గుడి, సీతమ్మ కన్నీటి ధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాల పరిశీలన
- అనంతరం జేఎన్టీయూలో అధికారులతో సమావేశం
- ఇటీవల కొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు
కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే రూ.100 కోట్లు విడుదలకు జీవో జారీచేయగా, ఆలయాన్ని పరిశీలించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం అంజన్న చెంతకు రానున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

జగిత్యాల, హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కొండగట్టు ఆంజనేయస్వామిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే, ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం రాష్ట్ర నలుమూలల నుంచి వేల మంది భక్తులు వస్తారు. తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం కేసీఆర్.. తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకొన్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొండగట్టుకు చేరుకొంటారని వెల్లడించారు. స్వామివారిని దర్శించుకొని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి గుడి, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలిస్తారని వివరించారు. అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తారని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కొండగట్టు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ డిజైన్ల రూపకర్త, ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే రెండుసార్లు కొండగట్టు క్షేత్రాన్ని పరిశీలించారు. ఆయన గుట్ట అభివృద్ధికి ఒక నమూనాను రూపొందించినట్టు తెలుస్తున్నది. యాదగిరిగుట్టపై 3 ఎకరాల స్థలమే అందుబాటులో ఉండగా, కొండగట్టుపై 12 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నది. దీంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సమాచారం. వాస్తు ప్రకారం గుట్టపైకి ఈశాన్యం వైపు నుంచి రోడ్డును నిర్మించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ కొత్త మార్గాన్ని నిర్మించడం వీలుకాకపోతే ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డును ఈశాన్యం వైపునకు మళ్లించాలని చూస్తున్నట్టు సమాచారం. గుట్టపై 125 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. స్వామివారి ఆలయ విస్తరణ, అనుబంధ నిర్మాణాలన్నీ కృష్ణ శిలతో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
ప్రతిపాదిత పనులివే..?
- స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం, రాతితో విమాన గోపురాల నిర్మాణం
- రెండో ప్రాకార నిర్మాణం, నాలుగు వైపుల రాజగోపురాల నిర్మాణం, యాగశాల, నివేదనశాల
- స్వామి వారి సన్నిధిలో రామాలయ నిర్మాణం, అభిషేక మంటప నిర్మాణం, సత్యనారాయణ స్వామి మంటపం
- ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనాల క్యూలైన్ల పునర్నిర్మాణం
- భక్తుల కోసం 100 గదుల ధర్మశాల, 50 వీఐపీ గదుల నిర్మాణం
- డార్మెటరీ మాల్, నిత్యాన్నదాన సత్రం, లడ్డు, పులిహోర ప్రసాదాల
- తయారీ కాంప్లెక్స్
- ఆలయ పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విద్యుద్దీపాల అలంకరణ, ఆలయ పరిసరాల సుందరీకరణ
- ప్రత్యేక సబ్‌స్టేషన్, అర్చకుల వసతి గృహాలు, పరిచారకుల గృహాలు
- ఈవో, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నివాస గృహాలు
- గుట్టపైకి వెళ్లే మధ్య దారిలో 50 గదుల చొప్పున రెండు ధర్మశాలలు
- అశోక వనంలో స్వామి వారికి పూల తోట సీఎం కేసీఆర్ కొండగట్టు
పర్యటన షెడ్యూల్ ఇలా..
- ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి ఉదయం 9.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
- అక్కడి నుంచి ఉదయం 9.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 9.40 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని జేఎన్టీయూకు చేరుకుంటారు.
- అక్కడి నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొంటారు. ప్రధా న ఆలయాన్ని, అనుబంధ ఆలయాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి జేఎన్టీయూకు బయలుదేరి అక్కడి సమావేశ మందిరంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
- మధ్యాహ్నం ఒంటి గంటకు కొండగట్టు నుంచి హెలికాప్టర్ ద్వారా బయలు దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు.
- అక్కడి నుంచి మధ్యాహ్నం 1.35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 1.40 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

