చేవెళ్ల రూరల్, అక్టోబర్ 4 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మన్నెగూడ రోడ్డులో ఇక నుంచి జరిగే ప్రతి రోడ్డు ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, లేదంటే ప్రభుత్వంపై కేసులు పెడతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన చేవెళ్ల మండలం కౌకుంట్లలో మీడియాతో మాట్లాడారు. చేవెళ్ల నుంచి మన్నెగూడ రోడ్డు మరీ అధ్వానంగా తయారయైందని, నిత్యం ప్రమాదాలతో అనేక మంది మరణిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలోనే రోడ్డుకు అప్పట్లోనే టెండర్ పూర్తయిందని, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గానికి వెళ్లే రోడ్డు ఇంత దారుణంగా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి హెలీక్యాప్టర్‌లో వెళ్తే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. నవంబర్‌లోగా రోడ్డు పనులు ప్రారంభించని పక్షంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.