మొయినాబాద్, జూన్10 : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి భూముల వ్యవహారం మరింత క్లిష్టతరంగా మారుతున్నది. దశాబ్దాలుగా నమ్ముకున్న తమ భూములను కాపాడుకునేందుకు నిరుపేద రైతులు కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను సోమవారం ఆయన నివాసంలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయంలోనూ కలిసి ఎలాగైనా తమ భూములను కాపాడాలని కోరారు. గతంలోనూ ముందుగానే తమ భూములను గుంజుకోబోతున్నారని చెప్పినా సీఎంతో మాట్లాడి, సమస్య పరిష్కరిస్తామన్నారని, అయినా అధికారులు వచ్చి భూములను స్వాధీనం చేసుకున్నారని ఆవేదన చెందారు. రైతుల ఒత్తిడి మేరకు కాలె యాదయ్య రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేశారు.
రైతుల భూములను గుంజుకుంటే ప్రభుత్వానికే చెడ్డపేరు
రైతుల గోడును విన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి ఎనికెపల్లి భూముల గురించి మాట్లాడారు. రైతుల భూములను గుంజుకుని ఎనికెపల్లిని మరో లగచర్ల చేయొద్దని చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను తీసుకోవడంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారని, స్థానికంగా తనతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కలెక్టర్‌తో అన్నట్టు గ్రామస్తులు తెలిపారు. వాళ్ల భూములు తీసుకోవద్దని, గోశాలకు మరెక్కడైనా భూములు చూపించాలని సూచించారు. అయితే ఎనికెపల్లి భూములు తీసుకోవాలని ప్రభుత్వం నుంచే స్పష్టమైన ఆదేశాలున్నాయని ఎమ్మెల్యేకు కలెక్టర్ సమాధానమిచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. భూముల విషయంలో ఏదైనా మాట్లాడాలనుకుంటే ముఖ్యమంత్రితో మాట్లాడాల్సిందిగా కలెక్టర్ చెప్పారని తెలిపారు. దీంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని భూబాధితులకు ఎమ్మెల్యే చెప్పారు.
నిరుపేద రైతులు సాగు చేసుకొని బతుకుతున్న భూములను తీసుకొని ఎనికెపల్లిని మరో లగచర్లను చేయొద్దు.. వాళ్ల భూముల జోలికి రాకండి.
– రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో ఫోన్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
ఆ భూములను తీసుకోవాలని ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలున్నయి. మీదేమైనా ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడండి
– కలెక్టర్ సమాధానం