హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల డిక్లరేషన్‌లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు. ఈనెల 26వ తేదీన ఇందిరా పార్ వద్ద మహాధర్నాకు పిలుపునిస్తూ అందుకు సంబంధించిన కరపత్రాన్ని ఎల్‌హెచ్‌పీఎస్ నేతలతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
అనంతరం రాంబల్‌నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించి అనేక హామీలు నెరవేర్చినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో లబ్ధి చేకూరిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ పేరిట 12 హామీలు ఇచ్చి, ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిందని నిప్పులు చెరిగారు. గిరిజన జాతికి రావాల్సిన నిధులను ఇవ్వడంలేదని, సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లంబాడీలకు సంబంధించిన భూములను పరిశ్రమల పేరిట లాక్కుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జరపల దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.