హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సందర్భంగా చేవేళ్ల డిక్లరేషన్‌లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణమే అమలుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి తండాలో గిరిజన హామీల అమలుపై చర్చించాలని పిలుపునిచ్చారు. గత కేసీఆర్ సర్కారు 3 వేలకు పైగా నూతన గిరిజన గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసిందని, జనాభా దామాషా ప్రకారం 6% ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించిందని, హైదరాబాద్‌లో బంజారా భవన్ నిర్మించిందని గుర్తుచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్.. గిరిజన గూడే లు, తండాలు, ప్రత్యేక పంచాయతీలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తింపు, బంజారాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, లంబాడీ జాతి అభివృద్ధికి తండా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు, గిరిజన నిరుద్యోగుల స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాల మంజూరు, లంబాడీ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు హామీలు ఇచ్చినట్టు గుర్తుచేశారు.
పోలవరం పూర్తయితేనే బనకచర్ల! ; కేంద్రానికి తేల్చిచెప్పిన పీపీఏ
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఆలోచించగలమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్రానికి తేల్చిచెప్పినట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజిబులిటీ రిపోర్టు)ను కేంద్ర జల్‌శక్తి శాఖకు సమర్పించింది. దీంతో ఆ ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్రం సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏతోపాటు, కృష్ణా, గోదావరి రివర్‌బోర్డులకు, అన్ని రాష్ర్టాలకు సూచించింది. పీఎఫ్ఆర్ రిపోర్టు కాపీని పంపింది. బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై పీపీఏ తాజాగా తన పరిశీలనలను కేంద్రానికి పంపిందని తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాకే బనకచర్ల లింక్‌పై ఆలోచన చేయగలమని వివరించింది. బనకచర్ల లింక్‌ను చేపడితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులను మరోసారి పొందాల్సి ఉంటుందని కూడా వివరించినట్టు సమాచారం. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సిద్ధం చేసినట్టు తెలిసింది. డీపీఆర్‌ను ఏపీ ప్రభుత్వానికి సమర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. పీబీ లింక్ ప్రాజెక్టు డీపీఆర్, అధ్యయనం బాధ్యతలను ఏపీ ప్రభుత్వం వ్యాప్కోస్‌కు అప్పగించింది.