హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని, లేకుంటే ఈ నెల 9న ఇందిరాపార్క్‌వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ఆదివాసీ, గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రూప్సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆదివాసీ, గిరిజన సంఘాల ఐక్య వేదిక ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్టీ వర్గాలకు 16 అంశాలతో కూడిన హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. హామీలు నెరవేర్చాలని సీఎంతోపాటు మంత్రులకు వినతిపత్రాల సమర్పణ, మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్ ఎదుట ధర్నా చేపడుతామని, అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 9న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో లంబాడీ, ఎరుకుల, కోయ, థోటి, చెంచు, కమ్మర, నకల, రాజగోండు తదితర ఎస్టీ తెగలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.