Cheruku Sudhakar | భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుధాకర్ తనయుడు చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి చెరుకు సుధాకర్‌తోపాటు తనను హత్య చేస్తానని బెదిరించాడని నల్లగొండ వన్ టౌన్ సీఐకి ఆదివారం సుహాస్ తెలిపారు. ఆదివారం ఉదయం 11:12 గంటలకు తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి.. ‘మీ నాన్న నా గురించి టీవీ చానెల్‌తో ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడ్ని చంపడానికి 100 వాహనాల్లో నా మనుషులు తిరుగుతున్నారు. నీ నవ్య హాస్పిటల్ కూడా కూల్చేస్తారు. నిన్ను (సుహాస్) సైతం చంపుతానని బెదిరించారు. వారంలో మీ నాన్న సుధాకర్‌ను చంపివేస్తారని వార్నింగ్ ఇచ్చారు’ అని సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన మా నాన్న చెరుకు సుధాకర్ రాజకీయంగా ఎదగడం జీర్ణించుకోలేక హత్య చేయడానికి కోమటిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశాడు. నన్ను, మా నాన్నను చంపుతానని ఫోన్ చేసి, బెదిరించిన కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. మా నాన్నకు, నాకు.. కోమటి రెడ్డి వెంకటరెడ్డితో ప్రాణ హాని ఉంది. కనుక మా ఇద్దరికి రక్షణ కల్పించగలరు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుతోపాటు తనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో రికార్డింగ్‌ను పెన్ డ్రైవ్‌లో పోలీసులకు సుహాస్ అందజేశారు.