వికారాబాద్, మార్చి 7, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిమిత్తం చేపట్టిన భూ సేకరణను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు వెలువడి 24 గంటలు కూడా కాకముందే అధికారులు శుక్రవారం కొందరు రైతుల నుంచి సమ్మతిపత్రాలు తీసుకొని పరిహారం చెక్కులను అందజేశారు. హకీంపేట పరిధిలోని సర్వే నంబర్ 252లోని 32 ఎకరాల భూసేకరణకు సంబంధించి 24 మందికి రూ.6.44 కోట్ల పరిహారాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అందజేశారు. హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముందో తెలుసుకోకముందే అధికారులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరును రైతుల తరఫున హైకోర్టులో వాదించిన న్యాయవాదులు తప్పుపడుతున్నారు.