జనగామ : విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీఎం కేసీఆర్ ఆ రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడి ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బడులను బాగు చేయాలని, విద్యార్థులకు ఉచితంగా విద్య అందచేయాలని సీఎం సంకల్పించారని మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్కూల్స్లో ఆధునీకరణ పనులు మొదలయ్యాయని చెప్పారు. మూడు విడతలుగా మొత్తం పాఠశాలలను బాగు చేయాలని నిర్ణయించామన్నారు. మొదటి విడతగా ఎంపిక చేసిన పాఠశాలలను బాగు చేసే బాధ్యతను ప్రభుత్వంతోపాటు పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అంతా కలిసి కృషి చేయాలన్నారు. తన వంతుగా చెన్నూరు పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు.