కాసిపేట, సెప్టెంబర్ 2 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలోని ధర్మారం, గురువాపూర్ మధ్యనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నది. శుక్రవారం అటవీ శివారులోకి గంగులు, రాములు తమ మేకలను తోలుకెళ్లారు. ఒక్కసారిగా మేకల మందపై చిరుత దాడి చేసింది. కాపరులు అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికులతో కలిసి చిరుత దాడి చేసిన ప్రాంతానికి వెళ్లగా, మేక కళేబరం కనిపించింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను అమర్చారు. శనివారం ఉదయం సీసీ కెమెరాలు చూడగా, శుక్రవారం సీసీ కెమెరాలు పెట్టిన 15 నిమిషాల్లోనే చిరుత అక్కడికి వచ్చి మేక కళేబరాన్ని ఎత్తుకెళ్లిన దృశ్యం రికార్డు అయినట్టు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూ టీ ఫారెస్ట్ రేంజర్ ప్రవీణ్ నాయక్ తెలిపారు.