హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసు క్రమబద్ధీకరణకు(Regularzation) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది . ఇందుకు విధివిధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సంబరాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ఎంపీడీవో కార్యాలయంలో, ఏటూరు నాగారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు పుష్ప గుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.