Cheddi Gang | మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాలలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున కలకలం రేపింది.
తెలిసిన వివరాల ప్రకారం నాస్పూర్ కలెక్టరేట్ ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. అలాగే పట్టణంలోని గోదావరి వాడలో మరో ఇంట్లో చొరబడి అక్కడ సెల్ఫోన్, రూ.5వేలను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. అదే ఏరియాలో మరో ఇంట్లో దొంగతనానికి పాల్పడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. పోలీసుల వాహనాన్ని చూసి అప్రమత్తమైన దొంగలు.. అక్కడ్నుంచి పారిపోయారు.
ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యారు. దొంగలను పోలీసులు వెంబడించారు. అయినా కంటికి కనిపించకుండా దొంగలు నిష్క్రమించినట్లు తెలుస్తోంది. ఈ చెడ్డి గ్యాంగ్ చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చెడ్డి గ్యాంగ్ చోరీలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ కాలనీల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.