మధిర: ఇసుక అక్రమ రవాణాను నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దులో ప్రాంతల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసు, మైనింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మధిర (Madhira) నియోజకవర్గంలోని మధిర ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద, తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన బోనకల్లు వద్ద, అదేవిధంగా ముదిగొండ మండలం వల్లభి నుంచి ముదిగొండ తోపాటు సత్తుపల్లి, వైరా నియోజకవర్గంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. ఈ మేరకు ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై అదనపు డీసీపీలు నరేష్ కుమార్, ప్రసాద్ రావుతో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ అధికారి సాయినాథ్, భూగర్భ జల శాఖ అసిస్టెంట్ అధికారి రమేశ్ ఇతర అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాలలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని వాగులు, నదీ పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారులంతా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. మైనింగ్ అధికారులు పోలీసు శాఖ సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్నారు.
జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్థానం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రధాన నిర్వాహకుల పేర్లను తప్పకుండా బయటకు తీసుకురావాలని చెప్పారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మధిర నియోజకవర్గ ప్రాంతంలోని ఆంధ్ర -తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ముదిగోండ-వల్లాబి, బోనకల్లు-వత్సవాయి, మధిర టౌన్-ఆత్కూర్ క్రాస్ రోడ్ చెక్ పోస్టులలో మైనింగ్ స్టాఫ్‌తోపాటు పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని పోలీస్ కమిషనర్ వివరించారు.