హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13, (నమస్తే తెలంగాణ): విచ్చలవిడిగా లభించే నకిలీ మందుల కట్టడికి తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ (టీఎస్‌డీసీఏ) చర్యలు చేపట్టింది. బయట లభించే ఔషధాల్లో నకలీలను తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. ఔషధాల ప్యాకింగ్‌పై ముద్రించే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వాటి నాణ్యతను చూసుకునేందుకు ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వుల ప్రకారం 300 ప్రముఖ ఔషధ బ్రాండ్లకు ఈ క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ మందులు 2023 ఆగస్టు 1 తరువాత తయారైనవి కావాలి.
స్కాన్ చేసి నిర్ధారించుకోండి..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన ఉత్తర్వుల మేరకు, 2023 ఆగస్టు 1వ తేదీ నుంచి, ప్రముఖ ఔషధాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం తప్పనిసరి. కేంద్ర ఔషధ నిబంధనల నియంత్రణ సంస్థ దీన్ని అమలు చేయనుంది. దీని ద్వారా ప్రజలు తాము కొనుగోలు చేస్తున్న మందులు నకిలీవా కాదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోగలుగుతారు. మందుల కొనుగోలు సమయంలో లేదా వినియోగించే ముందు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ధ్రువీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ సూచించింది.
వీటిని సంప్రదించండి..
ప్రజలు తమకు అనుమానం కలిగిన ఔషధాల సమాచారాన్ని స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ (డీసీఏ)కు నివేదించవచ్చు. వారి సంప్రదింపు వివరాలు https://dca. telangana.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.
నకిలీల కట్టడి దిశగా
క్యూఆర్ కోడ్లను పరిశీలించడం ద్వారా మార్కెట్లో నకిలీ మందుల సమస్యను నియంత్రించవచ్చు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది కీలక చర్యగా మారుతుంది. సరైన క్యూఆర్ కోడ్ లేకుండా ఉండే మందులు లేదా ప్యాకింగ్‌లో వివరాలు సరిపోలకపోతే వాటిని తక్షణమే నివేదించాలని వినియోగదారులకు సూచిస్తున్నాం.
– షానవాజ్ ఖాసిం, రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్