పీర్జాదిగూడ, జూన్ 3: అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ. 25 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన బోడుప్పల్లో కలకలం రేపింది. తమ వద్ద తీసుకొన్న డబ్బులు చెల్లించాలని నిందితుడి ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే… హైదరాబాద్ గోల్నాకకు చెందిన బాషెట్టి నాగరాజు పదేండ్లక్రితం బోడుప్పల్ అక్షయ్నగర్ కాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేసుకొని నివాసముంటున్నాడు.
ఇతను ఫార్మాస్యూటికల్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఫార్మాస్యూటికల్ అమెరికాకు ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నానని ఇందులో తనకు 25 శాతం లాభం వస్తుందని చెప్పారు. తమరెవరైనా డబ్బులు అప్పు ఇస్తే రూ.10 వడ్డీ ఇస్తానని చుట్టుప్రక్కల వారిని, సాప్ట్వేర్ ఉద్యోగులను మాయమాటలతో నమ్మించాడు. బోడుప్పల్లో సుమారు 40 మంది రూ. 5 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు నగదుతో పాటు క్రెడిట్ కార్డులు ఇచ్చినట్టు బాధితులు తెలిపారు.
100 నుంచి 150 మంది బాధితుల నుంచి సుమారు రూ. 25 కోట్ల వరకు తీసుకొని కొన్ని నెలల నుంచి అసలు, వడ్డీ ఇవ్వక తప్పించుకొని తిరుగుతున్నాడు. మోసపోయామని తెలుసుకొని బాధితులు గత ఫిబ్రవరి 13న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పరారీలో ఉన్న నాగరాజు ఇంటి ముందు సోమవారం బాధితులు ఆందోళన చేశారు.