హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మైక్రోఫైనాన్స్ పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సింగర్ మంగ్లీతోపాటు మరికొందరిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంగ్లీ సైతం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైంది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు ప్రకారం.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంతమంది కలిసి సుమారు వందమంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి తమ వద్ద డబ్బులు తీసుకున్నారని బాధితులు పేర్కొన్నారు. కాలం గడుస్తున్నా అసలు సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని తాను సూచించగా, మంగ్లీ, ఆమె బృందం బెదిరింపులకు పాల్పడ్డారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సినీ దర్శకుడు వేణు ఉడుగుల పేరు కూడా వెలుగులోకి వచ్చింది.
భారీ మొత్తంలో వసూళ్లు
పెట్టుబడుల పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు కలిసి బాధితుల నుంచి కొన్ని కోట్ల రూపాయల మేర వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. బాధితుల తరఫు న్యాయవాది సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలల కిందట సింగర్ మంగ్లీ పేరుతో మోసం చేశారంటూ కొందరు బాధితులు తనను కలిశారని చెప్పారు. ఈ మోసంలో మంగ్లీతోపాటు ఆమె సోదరుడు శివ, మధు ఉన్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు మధు ముందుండి మంగ్లీ పేరు చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పెట్టుబడుల రూపంలో సేకరించాడని ఆరోపించారు. లాభాలతోపాటు అసలు తిరిగి ఇవ్వకపోవడంతో వారంతా తనను ఆశ్రయించారని వివరించారు.
తనను ఓ కేంద్ర మంత్రి పేరు చెప్పి బెదిరించారని, ఇప్పటికే ఈ బెదిరింపులపై కేసు నమోదైందని, త్వరలోనే సివిల్సూట్ కూడా ఫైల్ చేయబోతున్నామని వెల్లడించారు. 23 రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందని, వట్టిపల్లితండాలో సుమారు 200 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. కోకాపేటలో పబ్బు, దవాఖాన, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నామని చెప్పి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని, గోకులనందన ఇన్ఫ్రా అనే సంస్థలో పెట్టుబడులు తీసుకున్నారని ఆరోపించారు. మంగ్లీ తనను మోసం చేసిందంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో మంగ్లీతోపాటు మరో ముగ్గురిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
అడ్వకేట్‌పై మంగ్లీ ఫిర్యాదు
నకిలీ వీడియోలతో సుభసింగబోస్ అనే అడ్వకేట్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ సింగర్ మంగ్లీ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 21న సుభసింగబోస్ పేరుతో పరిచయం ఉన్న వ్యక్తి తనను బెదిరించాడని ఆమె పేర్కొన్నారు. తనను కలువాలని ఒత్తిడి చేశారని, నిరాకరిస్తే అప్రతిష్టపాలు చేస్తానని బెదిరించారని ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధమూ లేని కరెన్సీ నోట్ల వీడియో చూపించి బెదిరించారని, మరో వ్యక్తితో కలిసి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. దీంతో తాను మానసిక వేదనకు గురయ్యామని పేర్కొన్నారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ సెక్షన్లు 79, 351(3) కింద కేసు నమోదుచేసిన నార్సింగి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.