గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 02:35:43

12 గంటల్లోనే చేజ్‌!

12 గంటల్లోనే చేజ్‌!

  • డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం
  • బాధితుడ్ని కాపాడిన తెలంగాణ పోలీసులు
  • అపహరణకు స్కెచ్‌ వేసింది దగ్గరి బంధువే
  • 48 గంటల్లో 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌
  • ఏడుగురి అరెస్టు.. పరారీలో మరో ఆరుగురు
  • వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో/కొండాపూర్‌, నమస్తే తెలంగాణ: ఆయనో డాక్టర్‌.. సంపాదించిన డబ్బుతో ఓ పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నాడు.. బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.10 కోట్ల దాకా ఉన్నాయి.. ఇంకేం.. విషయం తెలిసిన దగ్గరి బంధువు ఎలాగైనా ఆ డబ్బు ను కాజేయాలనుకున్నాడు. అడిగితే ఇవ్వరు కదా! అందుకే కిడ్నాప్‌ ప్లాన్‌ వేశాడు. సినీ ఫక్కీలో డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి కర్ణాటకకు తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, తెలంగాణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడి ఎత్తులను చిత్తుచేశారు. 12 గంటల్లోనే బాధితుడిని కాపాడి, మరోసారి తమ సత్తా చాటారు. ఘటన వివరాలను బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని కిస్మత్‌పురాకు చెందిన బెహజాత్‌ హుస్సేన్‌ డెంటల్‌ డాక్టర్‌. బండ్లగూడలో కొత్తగా ఓ బిల్డింగ్‌ కడుతున్నాడు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తన క్లినిక్‌ కోసం ఓ భాగాన్ని ఉంచుకొన్నాడు. ఆస్ట్రేలియా నుంచి డాక్టర్‌ భార్య సమీప బంధువు ముస్తఫా ఆర్థిక నష్టాలు, బ్యాంక్‌ మోసాలతో ఇండియాకు తిరిగివచ్చేశాడు. తన స్నేహితుడు ముబాషీర్‌కు భవనంలో ఓ పోర్షన్‌ను అద్దెకు ఇప్పించే విషయంలో డాక్టర్‌తో ముస్తఫా సన్నిహితంగా ఉంటున్నాడు. దగ్గరివాడే కదా అని డాక్టర్‌ కూడా అన్ని విషయాలు అతడికి చెప్పాడు. బ్యాంక్‌ఖాతాలో రూ.10 కోట్లు ఉన్న విషయాన్నీ తెలిపాడు. వెంటనే ముస్తఫా మెదడులో క్రూరమైన ఆలోచన పుట్టింది. ఆ డబ్బును కాజేసేందుకు కిడ్నాప్‌ ప్లాన్‌ వేశాడు. రెండు బృందాలతో కూడిన 13 మందితో కలిసి మంగళవారం కిడ్నాప్‌కు ముహూర్తం పెట్టుకొన్నాడు. డాక్టర్‌ క్లినిక్‌లో ఉండగా, మొదటి బృందంలోని కొంద రు బురఖాలో వెళ్లి బొమ్మ తుపాకులతో బెదిరించి దాడికి దిగా రు. అతడ్ని కారులో ఎక్కించి కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండకు తీసుకెళ్లారు. రూ.10 కోట్లు కావాలని డాక్టర్‌ కుటుంబసభ్యులకు వాయిస్‌ మెసేజ్‌ చేసి, రెండో గ్యాంగ్‌కు అతడిని అప్పగించారు. వాళ్లు బాధితుడిని బెంగళూరు వైపు తీసుకెళ్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు 12 బృందాలుగా రంగంలోకి దిగారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి సైబరాబాద్‌ పోలీసులు బెంగళూరు దారిలో వెళ్లారు. చివరకు ఏపీ పోలీసుల సహకారంతో అనంతపురంలో బాధితుడ్ని కాపాడి, ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లనుంచి 3 కార్లు, 7 సెల్‌ఫోన్లు, బొమ్మతుపాకులు, తాళ్ల బండిళ్లు, బురఖాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సహా ఆరుగురు పరారీలో ఉన్నారు. కిడ్నాప్‌ గ్యాంగ్‌ను పట్టుకొనేందుకు సహాయపడ్డ ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులకు సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 నాకు పునర్జన్మను ఇచ్చారు

నా జీవితంలో ఎప్పుడూ ఇంతటి నరకాన్ని అనుభవించలేదు. కిడ్నాపర్లు నా కాళ్లు, చేతులు కట్టేసి సీటు మధ్యలో కుక్కి మీద బెడ్‌ షీట్‌ను కప్పి పోలీసుల దృష్టిని మళ్లించారు. చేతివేళ్ల గోళ్లను కత్తిరించారు. పది నిమిషాల్లో చంపేస్తామని వాళ్లు భయపెట్టినప్పుడు ఇక నా పనైపోయిందనుకున్నా. నా కుటుంబాన్ని తిరిగి చూడలేనని అనుకున్నా. చివరకు దేవుళ్లలా తెలంగాణ పోలీసులు నన్ను కాపాడి పునర్జన్మను ఇచ్చారు.  తెలంగాణ పోలీస్‌ ఈజ్‌ గ్రేట్‌. - బెహజాత్‌ హుస్సేన్‌, బాధితుడు