హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఆర్థిక సేవల్లో పేరుపొందిన చార్లెస్స్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో ఆ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్హోవార్డ్, రామబొకా, ప్రతినిధులు సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
చార్లెస్ స్వాబ్ కంపెనీ భారత్‌లో నెలకొల్పనున్న తొలి కేంద్రం ఇదే. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. తద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయమై వివింట్ ఫార్మా ప్రతినిధులు సీఎం రేవంత్ బృందంతో చర్చలు జరిపారు.
కంపెనీ విస్తరణకు మద్దతు ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి డల్లాస్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించారు. అక్కడ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.