చారకొండ, ఫిబ్రవరి 5 : కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-మర్రిపల్లి మధ్య బైపాస్ నిర్మాణంలో అడ్డంగా ఉన్న 29 ఇండ్లను మంగళవారం అధికారులు కూల్చివేశారు. బుల్డోజర్లు ఇండ్లపైకి రావడంతో.. బాధితులు దిక్కుతోచక చిన్నాభిన్నమయ్యారు. కూల్చివేతలు ముగిశాక దొరికిన కాడికి సామగ్రిని తీసుకొని కన్నీళ్లను దిగమింగుకొని బరువెక్కిన గుండెలతో కదిలారు. కొందరు తెలిసినవారి ఇండ్లకు వెళ్లగా.. మరికొందరు బంధువుల ఇండ్లకు వెళ్లారు. ప్రభుత్వ పరిహారంతో కనీసం ఇంటి జాగా కూడా రాదని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వం కోల్పోయి రోడ్డు పాలయ్యాయమని వాపోయారు. స్థలంతోపాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంలో 22 అరల జాగ, ఇంటితోపాటు సర్వం కోల్పోయాం. ఐదుగురు అన్నదమ్ములం కలిసి ఒక్కో గదిలో కుటుంబంతో నివసించేటోళ్లం. ప్రభుత్వం రూ.7 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చింది. దీంతో కనీసం వంద గజాల జాగ రాదు. ఇండ్లు కూల్చేటప్పుడు సామాన్లు తీసుకోనివ్వలే.. దండం పెట్టినా కరుణించలేదు.. పిల్లలతో కలిసి రూ.4 వేలకు గది అద్దెకు తీసుకున్నా.. ప్రభుత్వం ఆదుకోవాలి.
10 అరల స్థలంలో ఇళ్లు కట్టుకున్నాం.. ఇద్దరు కొడుకులు.. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేటోళ్లం.. హైవే బైపాస్ రోడ్డు కోసమంటూ చెప్పకుండానే అధికారులు ఇల్లు కూల్చిండ్రు. సామాన్లు కూడా తీసుకోలేదు. మా కుటుంబం రోడ్డున పడింది. చేసేది లేక అప్పటికప్పుడు ఊళ్లో వెతికి రూం అద్దెకు తీసుకున్నా. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.