హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదుపుతున్నారని, ఇది ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే కుట్ర అని ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. జిల్లాల పునర్విభజనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం తమకిష్టం వచ్చినట్టు జిల్లాలు విభజిస్తే ఒప్పుకొనేది లేదని హెచ్చరించారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో గందరగోళం ఏర్పడిందని పేర్కొన్నారు. ఒకవైపు జిల్లాల సంఖ్యను తగ్గించబోమని చెప్తూనే, మరోవైపు రేషనలైజేషన్ చేస్తామనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జిల్లాల సంఖ్య మార్చకపోతే.. మరి దానిపై కమిషన్ ఎందుకని నిలదీశారు. జిల్లాలను మార్చితే జోనల్ వ్యవస్థతోపాటు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండేండ్ల సమయమైనా పడుతుందని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే ఉద్యోగ విభజన జరిగిందని, మళ్లీ జిల్లాల మార్పిడి జరిగితే ఉద్యోగుల్లో కూడా గందరగోళం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నదని దేవీప్రసాద్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, పీఆర్సీపై ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. సర్కార్ చర్యల వల్ల ఇప్పటివరకు 140 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో చంద్రబాబు తొమ్మిది డీఏలు పెండింగ్‌లో పెట్టినట్టుగానే, రేవంత్‌రెడ్డి కూడా తొమ్మిది డీఏలు పెండింగ్‌లో పెడతారేమోనని ఎద్దేవా చేశారు.
కేసీఆర్, తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమైందని, ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు జిల్లాల, మండలాలు సరిహద్దులు మార్చకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రానంద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా అంటూ చాక్లెట్ ఇచ్చారు కానీ, హెల్త్‌కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత ఉపేంద్రాచారి మాట్లాడుతూ.. జోనల్ వ్యవస్థను ఎత్తివేసే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. జోనల్ వ్యవస్థ కోసం కేసీఆర్ ఏడేండ్లపాటు పోరాటం చేశారని, ఆయన కృషితో స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కాయని పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.
పరిపాలనా వికేంద్రీకరణ జరగాలన్న ఉద్దేశంతోనే నాడు కేసీఆర్ ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటుచేసిందని దేవీప్రసాద్ తెలిపారు. అంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో సామాన్య ప్రజలు కలెక్టర్లను కలిసే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ఇప్పుడు జిల్లా పునర్విభజన పేరుతో విధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. ‘ఎన్టీఆర్ తెచ్చిన మండల వ్యవస్థతో లాభం జరగలేదా? కేసీఆర్ చేసిన జిల్లాల మీద కడుపుమంట ఎందుకు? ఎన్నికల హామీలు నెరవేరుస్తామంటే మేమైనా అడ్డుకున్నామా?’ అని నిలదీశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడంలేదని, వాటిలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నదని ఆరోపించారు.