హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని హెచ్‌టీ (హైటెన్షన్) విద్యుత్తు వినియోగదారులకు టైం ఆఫ్ డే టారిఫ్ విధానంలో మార్పులు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రాత్రిపూట ఇచ్చే అలవెన్స్‌లో కోత పెట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)లో ఉత్తర డిస్కం, దక్షిణ డిస్కంలు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. ఇందుకు అనుమతించాలని ఈఆర్సీని అభ్యర్థించాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణను నిర్వహించనున్నది. విద్యుత్తు వినియోగం రోజులో ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో గరిష్ఠ డిమాండ్ నమోదవుతున్నది. ఈ సమయంలో ఇంధన ఎక్సేంజీలో డిస్కంలు అధిక ధర చెల్లించి కరెంట్‌ను కోనేవి. దీంతో డిస్కంలపై వేలకోట్ల భారం పడుతున్నది.
గరిష్ఠ డిమాండ్ సమయంలో విద్యుత్తు వినియోగించే వారిపై అధిక చార్జీలు వసూలు చేసేందుకు టైం ఆఫ్ డే పేరుతో కొత్త టారిఫ్ అమలవుతున్నది. 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ కనెక్షన్ వినియోగదారులైన పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, ప్రార్థనా మందిరాలు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు తదితర వినియోగదారులకు టైం ఆఫ్ డే టారిఫ్ వర్తిస్తుంది. మన దగ్గర పీక్ డిమాండ్ సమయంలో అదనంగా చార్జీ చేసి, నాన్ పీక్ అవర్స్‌లో అలవెన్స్ ఇస్తున్నారు. మన వద్ద రాత్రిపూట యూనిట్‌కు 1.50 అలవెన్స్‌గా ఇస్తున్నారు. దీనికి డిస్కంలు కోత పెట్టాయి. ఈ విధానంలో టీజీఎస్పీడీసీఎల్ రూ.914.7 కోట్లు, టీజీఎన్పీడీసీఎల్కు రూ.110. 4 కోట్ల నష్టాలు తగ్గుతాయని డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్రంలో 16 వేల మంది హెచ్‌టీ విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. రాత్రిపూట ఇచ్చే అలవెన్స్‌లో కోత విధించడంతో వీరిపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఉదయం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూనిట్ విద్యుత్తుకు ఒక రూపాయి చొప్పున టైం ఆఫ్ డే టారిఫ్‌గా అదనంగా (ఎక్స్ట్రా) వసూలు చేసేవారు. ఉదయం 10 గంట నుంచి సాయంత్రం 6 గంటలకు సాధారణ టారిఫ్ వసూలు చేసేవారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు యూనిట్‌కు రూ.1.50 అలవెన్స్‌గా ఇచ్చేవారు. అంటే ఒక్కో యూనిట్‌కు 1. 50 తగ్గించేవారు.
ఉదయం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూనిట్‌కు ఒక రూపాయి అదనంగా వసూలు చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఆమోదిత చార్జీలు ఉంటాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి అలవెన్స్ ఇవ్వరు. అంటే రాత్రిపూట ఇచ్చే అలవెన్స్‌కు కోతపెట్టినట్టే.