HMDA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారణ గందరగోళంగా మారుతున్నది. నిర్ణీత గడువులోగా హైకోర్టుకు నగరంలో మిగిలిన చెరువులు, కుంటల భౌతిక స్వరూపం, శాస్త్రీయపరమైన జియో కోఆర్డినేషన్ పాయింట్లతో కూడిన జాబితాను నివేదించాల్సి ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వ హడావుడితో చెరువుల నిర్ధారణ విషయంలో తప్పులకు దారితీస్తున్నది. ప్రాథమిక, ఫైనల్ నోటిఫికేషన్లలో పొందుపరుస్తున్న చెరువుల వివరాలన్నీ మార్పిడి జరిగినట్టుగా పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. బఫర్, ఎఫ్టీఎల్, జియో కోఆర్డినేషన్ అంశాల్లో మార్పిడి చేసి కొత్త మ్యాపులను అప్లోడ్ చేయడంతో మరిన్ని సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం ఉన్నది.
ముఖ్యంగా మ్యాపుల జియో కోఆర్డినేషన్ పాయింట్లు మారిపోవడంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల స్థలాలు తగ్గే ప్రమాదం ఉన్నదని, దీంతో గతం లో ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు కూడా ఇప్పుడు సక్రమం అయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల నోటిఫికేషన్‌పై కసరత్తు జరుగుతున్న తరుణంలో రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీలో ఉన్న విభాగాల తప్పిదాలు.. చెరువు భూములకు చేటుచేసేలా ఉన్నాయి.
ముఖ్యంగా మ్యాపుల తయారీ సమయంలో జరుగుతున్న మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో హెచ్ఎండీఏ పరిధిలో లేక్ మ్యాపుల్లో జరుగుతున్న తప్పిదాలను లేవనెత్తుతూ పౌర హక్కుల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తప్పుల తడకగా చెరువు మ్యాపులను రూపొందించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాపుల నిర్వహణలో హెచ్ఎండీఏ నిర్లక్ష్యం చూపుతున్నదని పౌరహక్కుల నేత లుబ్నా సార్వత్ ఆరోపించారు.
చెరువులను పరిరక్షించే బాధ్యతను భుజాన వేసుకున్న హెచ్ఎండీఏ.. ఆ విధులను నిర్వర్తించడంలో విఫలమవుతున్నదని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపూర్ గ్రామ పరిధిలో ఉండే పెద్ద చెరువు (లేక్ ఐడీ-3354)కు 2015లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటివరకు తుది నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాలు తప్పులుగానే ఉన్నాయని ఆరోపించారు.
తుర్కయంజాల్ మాసబ్ చెరువు (లేక్ ఐడీ 1954), బాలానగర్‌లోని సున్నం చెరువు (లేక్ ఐడీ 4805) వివరాలు కూడా తప్పులుగానే ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ లేక్స్ వెబ్సైట్లో 2,569 చెరువుల ఎఫ్టీఎల్, క్యాడస్ట్రల్ మ్యాపులను సరిచూసుకోవాలని, వాస్తవాలకు భిన్నంగా మ్యాపుల్లో మార్పులు ఉన్నట్టుగా అనుమానాలను వ్యక్తం చేశారు. కొన్ని చెరువుల మ్యాపులు అందుబాటులోనే లేకుండా పోయినట్టుగా తెలిపారు. ఆ జాబితాలో గండిపేటకు సమీపంలోని మంచిరేవుల వద్ద ఉండే నాగిరెడ్డి కుంట లేకుండానే పోయిందని ఆరోపించారు.