హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాసం మంగళవారం జనసంద్రాన్ని తలపించింది. తమ ప్రియతమ నేతను చూసేందుకు, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సోమవారం అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ అనంతరం నందినగర్ నివాసానికి చేరుకున్నారు. చాలాకాలం తర్వాత తన అభిమానులను నేరుగా కలుసుకున్న కేసీఆర్, వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఒకరినీ పేరుపేరునా పలుకరిస్తూ, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ‘బాగున్నారా?’ అని కేసీఆర్ ఆప్యాయంగా పలుకరిస్తుంటే, అభిమానులు ఉద్వేగానికి లోనయ్యారు.
తమ నేత మాటల్లోని ఆ పాత వాడి, వేడి.. అదే ప్రేమను చూసి వారు తన్మయత్వంలో మునిగిపోయారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన వారితో నందినగర్ వీధులన్నీ కిటకిటలాడాయి. కేసీఆర్ ఇంకా తమ గుండెల్లోనే ఉన్నారని, ఆయన నాయకత్వం రాష్ట్రానికి నిరంతరం అవసరమని ఈ సందర్భంగా అభిమానులు నినదిస్తూ తమ ఆకాంక్షను చాటుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సైతం ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్ ఖ్యాతికి, ప్రజలకు ఆయనపై ఉన్న అచంచలమైన నమ్మకానికి నందినగర్ నివాసం సాక్ష్యంగా నిలిచింది.
నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో హృద్యమైన సన్నివేశం ఒకటి చోటుచేసుకున్నది. ఒక వీరాభిమాని తన బిడ్డను కేసీఆర్ చెంతకు తీసుకొచ్చి, ఆ బిడ్డకు పేరు పెట్టాలని కోరారు. ఆ విన్నపాన్ని మన్నించిన గులాబీ బాస్.. ఎంతో ఆప్యాయంగా ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకొని నామకరణం చేశారు. కేసీఆర్ ఆశీర్వాదంతో, ఆయన చేతులమీదుగా తమ కుమారుడికి పేరు పెట్టుకోవాలన్న తెలంగాణ ఉద్యమకారుడి ప్రయత్నం మంగళవారం నెరవేరింది.
పరిగి నియోజకవర్గం మల్లేపల్లికి చెందిన దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమకారుడు. తన కుటుంబంతో వచ్చిన నర్సింహులు, అనిత దంపతులను కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. వేద పండితుడి సలహాతో, బాబు జన్మనక్షత్రం ప్రకారం వచ్చిన ‘సు’ అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేండ్లు వర్ధిల్లాలని కేసీఆర్ ఆశీర్వదించారు. అక్కడున్న వారందరూ కేసీఆర్ అభిమానుల పట్ల చూపే నిరుపమానమైన ప్రేమను చూసి ముగ్ధులయ్యారు.