 
                                                            Chandranna | మాజీ మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో కొంతమంది నమ్మకద్రోహులు ఉన్నారని తెలిపారు. బసవరాజు ఎన్కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందన్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. కగార్తో మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మావోయిస్టులు లేకుండా చేస్తామన్న అమిత్ షా ప్రకటన సాధ్యం కాదని వెల్లడించారు. ఆయుధాలను తీసుకుని మూకుమ్మడిగా లొంగిపోవడాన్ని సమర్థించనని అన్నారు.
నా అనారోగ్య కారణాలతోనే అజ్ఞాతం వీడానని చంద్రన్న స్పష్టం చేశారు. మావోయిస్టు సిద్ధాంతం ఇంకా తనలో ఉందని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం లేదని.. ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ దగ్గర ఎక్కువ మొత్తంలో నిధులు ఉన్నాయనేది అవాస్తవమని తెలిపారు. బస్తర్ ప్రాంతాన్ని పాలకవర్గాలు ఎప్పుడూ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌కు చెందిన పల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగారు. కేంద్ర కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. మంగళవారం నాడు అజ్ఞాతం వీడి డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
1979లో పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతుండగా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ)లో ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న దగ్గు రాజలింగుతో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రేరణతో ప్రభావితమై, 1980లో కిషన్‌జీకి అనుచరుడిగా మారాడు. అదే ఏడాది సంగ్రామ్ నాయకత్వంలో దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయుధ దళంలో చేరాడు. 1981లో పీపుల్స్‌వార్‌లో చేరి, 1983లో కమాండర్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2024లో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించడం, దీర్ఘకాలిక మోకాళ్ల వ్యాధి, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, నాయకత్వంతో ఏర్పడిన సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలతో లొంగిపోయాడని ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
 
                            