IAS Officers | హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాజకీయ అనిశ్చితి, రోజుకొక వివాదంతో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఒక అధికారితోపాటు సీఎస్ రేసులో ఉన్న మరో అధికారికి స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌చేసి, ఈ మేరకు ఆఫర్ ఇచ్చినట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నట్టు, అనేక భారీ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నందున అనుభవజ్ఞులైన మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రావాలని సదరు అధికారులను చంద్రబాబు గట్టిగా కోరినట్టు సమాచారం.
రాష్ట్ర ఆర్థిక శాఖలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పదవీ విరమణకు చేరువలో ఉండగా, పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి తదుపరి చీఫ్ సెక్రటరీ రేసులో ఉన్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా చాకచక్యంతో నెట్టుకురాగల సామర్థ్యం ఒకరికి ఉంటే, ఎంతటి బడా కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విధంగా చేయగల నేర్పరితనం మరో అధికారి సొంతం. అందుకే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఇద్దరు అధికారులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. కాంగ్రెస్ సర్కారు సైతం వారికి అదేవిధమైన ప్రాధాన్యం కొనసాగిస్తున్నది. ప్రస్తుతానికి రాష్ట్ర సర్కారు నుంచి వారికి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో వారు సర్దుకుపోలేకపోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికీ, మంత్రులకు మధ్య సమన్వయలోపం, విచారణలు, కేసుల పేరుతో అధికారులపై వేధింపులు, నిధుల సమస్య, బిల్లుల చెల్లింపు కోసం ఒత్తిళ్లు, పరిశ్రమలకు భూముల కేటాయింపులో మంత్రుల మితిమీరిన జోక్యం తదితర అంశాలతో వారు కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు అక్కడి రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండే సీనియర్ అధికారుల కోసం వేట కొనసాగిస్తున్నట్టు, ఇందులోభాగంగా తనకు గతంలో మంచి పరిచయం ఉన్న ఈ ఇరువురు అధికారులను ఏపీకి రావాలని కోరినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉద్యోగాలకు రాజీనామా చేసి వస్తే ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తామని, ఐదేండ్లపాటు ఎటువంటి ఢోకా ఉండదని, ఆ తరువాత కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన స్వయంగా ఫోన్‌చేసి వారికి భరోసా ఇచ్చినట్టు సమాచారం. కేంద్రం నుంచి ఏపీకి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయని, పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నందున అనుభవజ్ఞులైన అధికారుల అవసరం తమకు ఎంతో ఉన్నదని ఆయన చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఏపీకి వెళ్లేందుకు సదరు అధికారులు మొగ్గు చూపారనే చర్చ జరుగుతున్నది. వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లగా, ఆయన వారిని రిలీవ్ చేయవద్దని సీఎస్‌కు స్పష్టంచేసినట్టు సమాచారం. అంతేకాదు, వారిద్దిరినీ పిలిచి ఇక్కడే మంచి భవిష్యత్తు ఉంటుందని, పదవీ విరమణ తరువాత ఇక్కడే సలహాదారుగా నియమించుకుంటామని ఒకరికి, తదుపరి సీఎస్‌గా నియమిస్తామని మరొకరికి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు వినికిడి.
తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వ మనుగడపై సదరు అధికారులకు నమ్మకం కుదరడంలేదని చర్చ జరుగుతున్నది. కేంద్రం నుంచి కూడా ఆశించినస్థాయిలో సహకా రం లభించకపోవడం, కొందరు సీనియర్ మంత్రులు తరచూ పార్టీ హైకమాండ్‌కు ఇచ్చే ఫిర్యాదులు ప్రభుత్వ మనుగడపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో అని వారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజూకూ ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, విచారణలు, కేసుల పేరు తో పలువురు అధికారులను వేధింపులకు గురిచేయడం, కొందరు అధికారులపై ప్రత్యేక నిఘా ఉంచడం తదితర అంశాలు వారిని కలవరపాటుకు గురిచేస్తున్నట్టు, ఇదే విషయాన్ని వారు తమ సన్నిహితుల వద్ద పంచుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. ఏపీ సీఎం ఇచ్చిన హామీని తిరస్కరిస్తే, మంచి అవకాశాన్ని కోల్పోయినట్టు అవుతుందని వారు అభిప్రాయపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఏపీ ప్రభుత్వం ఏన్డీఏ భాగస్వామిగా ఉన్నందున అక్కడికి వెళ్తే కేంద్రం నుంచి అవసరమైన సహకారం లభిస్తుందని, అనేక ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశం ఉన్నందున తమసేవలకు మంచి గుర్తింపు ఉంటుందని వారు భావిస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీతో వారు ఏపీకి వెళ్లాలనుకున్న తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు అధికావర్గాలు పేర్కొంటున్నాయి.