గోదావరి నీళ్లను చెరబట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సహా బీఆర్ఎస్వీ జంగ్ సైరన్ మోగించింది. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టులపై అవగాహన కల్పించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ దిశానిర్దేశంలో ఉప్పల్‌లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సు చైతన్యవంతంగా సాగింది. బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రంలోని బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని విద్యార్థి నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించింది. తెలంగాణ హక్కులను కాపాడుకొనేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు మళ్లీ ఉద్యమ వేదికలు కావాలని ఆకాంక్షించింది. అవసరమైతే జాతీయ రహదారులను దిగ్బంధించి.. రైలురోకోలు చేపట్టి ఢిల్లీ మెడలు వంచి బనకచర్లను ఆపుదామని పిలుపునిచ్చింది.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ జలహక్కులకు పిండం పెట్టే ఆ కుట్రను ఆపేందుకు కేసీఆర్ ఉన్నారని, ఆ సంగతిని రేవంత్‌రెడ్డి, చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు నిల్చున్నా కేసీఆర్‌గా భావించి కారు గుర్తుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్, బీజేపీ ఒకటై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
హైదరాబాద్ మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ జలాలు మనకు కాకుండా చేసే గద్ద పాత్రను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పోషిస్తుందని విమర్శించారు. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల గోదావరి మిగులు జలాల్లో 950 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాక ఏపీలో ఏ ప్రాజెక్టు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. 1,486 టీఎంసీల గోదావరి నికరజలాల్లో 968 టీఎంసీలను తెలంగాణకు ఇచ్చేలా కేంద్రం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌లోని ఇతర నేతల మాటలు చూస్తుంటే మేడిగడ్డ పగుళ్ల వెనక కుట్ర ఉన్నదని అనిపిస్తున్నదని చెప్పారు. పిల్లర్ల వద్ద శబ్దం వచ్చిందని అప్పట్లో కొందరు చెప్పినా ఎన్నికల హడావుడిలో పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు నిజమని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. చంద్రబాబు కోవర్టు రేవంత్‌రెడ్డి గోదావరి నీళ్లను ఆంధ్రకు అప్పగిస్తున్నారని విమర్శించారు. సముద్రంలో కలిసే గోదావరి మిగులు జలాల విషయంలో కేంద్రం నోరు విప్పాలని, తెలంగాణ వాటా తేలుస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెడుతూ రేవంత్ తొత్తుల్లా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారుల పేర్లను బీఆర్ఎస్వీ నేతలు రాసిపెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మిత్తితోసహా చెల్లిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు కలిసి తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక అయిన బీఆర్ఎస్పై ముప్పేట దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్‌గాంధీకి తెలంగాణలో రేవంత్‌రెడ్డి సాగిస్తున్న విధ్వంసక పాలన కనిపించడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ పోరాడితేనే మూసీ ప్రక్షాళన, లగచర్ల, కంచగచ్చిబౌలి అక్రమాలు ఆగాయని పేర్కొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని సబ్బండవర్ణాలు కదం తొకి స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసుకున్నాయని కేటీఆర్ గుర్తుచేశారు. ‘తెలంగాణలో హనుమంతుని గుడి ఉండని ఊరు, కేసీఆర్ పథకం అందని ఇల్లు ఉండదు. సంక్షేమంలో స్వర్ణ యుగంలాగా కేసీఆర్ పాలన సాగింది. రైతు బంధు కింద రైతు పెట్టుబడి సాయంగా రూ.73 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. ఏ కారణం చేత రైతు చనిపోయినా ఆ కుటుంబం రోడ్డున పడొద్దని ప్రపంచంలో ఎకడా లేనివిధంగా రూ.5 లక్షలతో రైతు బీమాను అమలు చేశారు. 200 వృద్ధాప్య పింఛన్‌ను 2 వేలకు, 500 వికలాంగుల పెన్షన్‌ను 6000కు పెంచారు’ అని గుర్తుచేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నది. సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, సీడబ్ల్యూసీల క్లియరెన్స్, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేకుండానే బనకచర్లను నిర్మిస్తున్నది. దీనికి తెలంగాణలోని రేవంత్ సర్కారు వంతపాడుతున్నది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక అయిన బీఆర్ఎస్ను లేకుండా చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనై.
-కేటీఆర్
ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, సీడబ్ల్యూసీల క్లియరెన్స్, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేకుండా బనకచర్లను కడుతున్నారని మండిపడ్డారు. ‘అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. మేం కూడా చేస్తున్నామని మొన్న ఢిల్లీ చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి చెప్పాడు. హామీల అమలుపై ప్రజలు అడగొద్దని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కల్పిత కథలు సృష్టించారు. బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు ఒకటయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లు మాట్లాడటానికి కూడా భయపడ్డ తెలంగాణ వ్యతిరేకులు.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే విర్రవీగుతూ మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ ఫైరయ్యారు.
ప్రధాన మీడియా అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం సోషల్ మీడియా. దానిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోండి. ప్రజా సమస్యలను విసృ్తతంగా సోషల్ మీడియాలో చూపించండి. బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వాలను కించపరిచే స్లాటర్ హౌస్‌ల లాగా మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి. రీట్వీట్ చేసినందుకు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే శశిధర్‌గౌడ్‌ను 20రోజులు జైల్లో పెట్టింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం’ అని విమర్శించారు.
మూసీ ప్రక్షాళనలోని లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టినంకనే రేవంత్‌రెడ్డి లాగులు తడిచాయని కేటీఆర్ అన్నారు. ‘మనం పోరాటం చేస్తేనే మూసీ కుట్రలు ఆగాయి. లగచర్ల ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. కంచ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో విద్యార్థుల వీరోచిత ఉద్యమం ముందు ప్రభుత్వం ఓడింది. బీఆర్ఎస్వీ పోరాటాలకు మన లీగల్ సెల్ అండగా నిలిచింది. పోరాడిన వారికే అవకాశాలు వస్తాయి. త్వరలో కొత్త బీఆర్ఎస్వీ కమిటీని ఏర్పాటుచేస్తాం. కొత్త యువరక్తానికి అవకాశం కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి వరి ఉత్పత్తిలో దేశంలోనే 12వ స్థానంలో ఉన్న తెలంగాణను పంజాబ్, హర్యానాను వెనకి నెట్టి 2022 నాటికి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టిన నేత కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘వ్యవసాయంలోనే కాదు తలసరి ఆదాయంలోనూ తెలంగాణ నంబర్‌వన్. 2014లో తలసరి ఆదాయంలో 14వ ర్యాంకు ఉన్న తెలంగాణ 2022 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలుంటే కేసీఆర్ 33 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. 200 గురుకుల స్కూళ్లను 1,022కు పెంచారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలిచ్చిన మోదీప్రభు త్వం.. తెలంగాణకు ఒకటీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలనూ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
మూసీలో లక్షన్నర కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయట పెట్టినంకనే రేవంత్‌రెడ్డికి లాగులు తడిచినయ్. మనం పోరాటం వల్లే మూసీ కుట్రలు ఆగినయ్. లగచర్ల ఆడబిడ్డలను ఢిల్లీ దాకా తీసుకెళ్లి బాధితుల పక్షాన నిలిచినం. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో విద్యార్థులు చేసిన వీరోచిత ఉద్యమం ముందు రేవంత్ సర్కారు ఓడింది.
-కేటీఆర్
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడగొడితే మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ రెచ్చగొట్టారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు రాహుల్ ఏడబోయారని మండిపడ్డారు. ‘తెలంగాణలో పనులన్నీ చంద్రబాబు కోవర్టులే చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పారు. వారం రోజులుగా ఒకో సూలుకు కాలేజీకి వెళ్లి బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి చెప్తున్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలకు అభినందనలు. పోరాటాన్ని ఇలానే కొనసాగించండి. అవసరమైతే పోస్ట్‌కార్డు ఉద్య మం. ఆన్లైన్ పిటిషన్‌ను ప్రారంభించండి. అడ్డబిడ్డలకు ఇస్తానన్న 2500 నేటికీ ఇవ్వడం లేదు. 20 నెలల నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 50 వేల బాకీ ఉంది.
20 నెలల్లో తెలంగాణలో సుమారు ఏడు లక్షల వివాహాలు జరిగాయి. ఇలా ఏడు లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది. బీఆర్ఎస్వీ అంటే విద్యార్థి విభాగమే కాదు. తెలంగాణ హకులను కాపాడేందుకు ఫ్రంట్లైన్లో ఉండి పోరాడే వీరోచిత సంస్థ. గతంలో విద్యార్థి నేతలైన బాల్క సుమన్, గాదరి కిశోర్, గెల్లు శ్రీనివాస్, బాలరాజ్యాదవ్ రాకేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులను కేసీఆర్ గెలిపించి పదవులు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌తో మూడోవంతు సీట్లు ఆడబిడ్డలకి రాబోతున్నాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బం డారు లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవికుమార్‌గౌడ్, చిరుమళ్ల రాకేశ్, ఆంజనేయగౌడ్, బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు పడాల సతీశ్, తుంగ బాలు, కడారి స్వామియాదవ్, ధర్మేందర్‌రెడ్డి, పల్ల ప్రవీణ్‌రెడ్డి, కృష్ణ, తొట్ల స్వామియాదవ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సు ప్రాగణంలోకి కేటీఆర్ రాకతో విద్యార్థులంతా గులాబీ కండువాలు ఊపుతూ నిలబడి స్వాగతం పలికారు. సీఎం.. సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ పాటలకు యువత కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేశారు. ‘వియ్ లవ్ కేసీఆర్’ సెల్ఫీ పాయింట్ వద్ద విద్యార్థులంతా ఫొటోలు తీసుకొని మురిసిపోయారు. ప్రాంగణం మొత్తాన్ని గులాబీ జెండాలతో అలంకరించారు. సదస్సులో తొలుత తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయాలతోపాటు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చారు.
విద్యార్థుల నుంచి ప్రతిస్పందన తీసుకున్నారు. బనకచర్ల ద్వారా మన నీటివాటాను ఏపీ ఎలా కొల్లగొట్టబోతున్నదో కులంకుషంగా పాయింట్లవారీగా వివరించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి బీఆర్ఎస్వీ ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యక్రమం ఆరంభం నుంచి ముగింపు వరకు యువత ఎంతో ఉత్సాహంగా విజిల్వేస్తూ, కేరింతలతో గడిపారు. జై తెలంగాణ, కేసీఆర్, కేటీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడతామని అన్నప్పుడు విద్యావంతుల నుంచి భారీ స్పందన వచ్చింది.
80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎలా ఉంటుందో చెప్పాలని కేసీఆర్ అడిగేసరికి నోరు మూసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘కాళేశ్వరం మీద కాంగ్రెస్ ఆరోపణలు చేసిన తెల్లారే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ వచ్చి కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే, నీళ్లలోకి దిగకుండానే సాయిల్ టెస్ట్ జరపకుండానే నివేదిక ఇచ్చింది. 500 సంవత్సరాల్లో ఎన్నడూ రాని విధంగా 2022లో గోదావరికి 28 లక్షల క్యూసెకుల వరద వచ్చింది. ఆ రోజే మేడిగడ్డకు ఏం కాలేదు. పోయిన సంవత్సరం ఇదే సమయానికి 10 లక్షల క్యూసెకుల వరద నీరు వచ్చింది. అప్పుడు కూడా మేడిగడ్డకు ఏమీ కాలేదు. ఈ రోజు కూడా గేట్లెత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టును బదనాం చేశాక నోటికి వచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టారు’ అని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచారని కేటీఆర్ చెప్పారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది. గూగుల్‌లో కొట్టినా ఇదే విషయం చెప్తున్నది. కాంగ్రెస్ చేసినట్టు ఒక ప్రాజెక్టునే 40 సంవత్సరాలపాటు ఆలస్యంగా కాకుండా, ఒక తపస్సు లాగా దీక్ష, నిబద్ధతతో నాలుగేండ్ల్లలోనే కేసీఆర్ పూర్తిచేశారు. కాళేశ్వరంతో తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీటిని ఇవ్వడంతోపాటు పారిశ్రామిక అవసరాలను కూడా కాళేశ్వరం తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం. కాంగ్రెస్, బీజేపీలు కలలో కూడా ఊహించలేని ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని కేసీఆర్ కట్టి చూపించారు. అందుకే కడుపు మంటతో లక్ష కోట్ల అవినీతి అని కాళేశ్వరం మీద ఇద్దరు కూడబలుక్కుని విష ప్రచారం చేస్తున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బరాజ్ పగుళ్ల వెనుక కాంగ్రెస్ కుట్ర దాగి ఉన్నది. పిల్లర్ల వద్ద పెద్ద శబ్దం వచ్చిందని నాడే కొందరు చెప్పిండ్రు. కానీ, ఎన్నికల హడావుడిలో అంతగా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల విమర్శలు చూస్తుంటే మేడిగడ్డ పగుళ్ల వెనుక కుట్ర దాగి ఉన్నదన్న అనుమానాలు కలుగుతున్నయి.
-కేటీఆర్