Chandrababu | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు బద్ధశత్రువైన చంద్రబాబుతోనే తెలంగాణను పొగడక తప్పని పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌ది. వ్యవసాయం దండుగ అన్న బాబు నోటితోనే తెలంగాణలో నేడు సాగు పండుగైందని అనిపించిన చతురత కేసీఆర్‌ది. ‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. రైతులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి నిర్ణయాలు తీసుకొంటుంది’.. అని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతు సంక్షేమం ఏ స్థాయిలో ఉన్నదో చెప్పేందుకు ఈ మాటొక్కటి చాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత తెలంగాణ పాలనాతీరును ప్రశంసించారు. తెలంగాణలో వ్యవసాయం, భూముల ధరలను ఏపీతో పోల్చి చూపుతూ మాట్లాడారు.
అభివృద్ధితోనే తెలంగాణ భూముల విలువ పెరిగింది..
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ప్రేమిస్తున్నదని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. ‘ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ..ఆ ప్రాంతంలో భూముల విలువ పెరుగుతుంది. సాగునీరు అందుబాటులో ఉంటే విస్తీర్ణంతోపాటు, భూమి విలువ పెరుగుతుంది. పరిశ్రమలు, రోడ్లు వస్తే విలువ పెరుగుతుంది. దాని వల్ల వ్యవసాయంలో నష్టపోయినా.. భూమిని అమ్ముకొని రైతులు ఒడ్డెక్కేవారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్‌లో నాలుగైదు ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది. అందుకే అక్కడ భూముల విలువ పెరిగింది’ అని తెలిపారు. ఏపీ, తెలంగాణలో భూముల విలువ వ్యత్యాసాన్ని పోల్చిచూపుతూ.. నెల క్రితం కూ డా చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.
రైతు కోసం కేంద్రానికి ఎదురొడ్డి..
రైతుల కోసం కేంద్రానికి ఎదురొడ్డి నిలబడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా విద్యుత్తు రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లోపెట్టి ప్రైవేటుపరం చేసేందుకు సంస్కరణల పేరుతో కుట్రలకు తెరలేపిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నది. మాట వినని రాష్ర్టాలను నయానా భయానా బెదిరించి దారికి తెచ్చుకొంటున్నది. తెలంగాణను కూడా బెదిరించేందుకు మోదీ సర్కారు ప్రయత్నించింది. కానీ, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం బెదిరింపులకు ఏమాత్రం బెదరలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దీనిపై కక్షగట్టిన మోదీ సర్కారు.. రాష్ర్టానికి ఎఫ్ఆర్బీఎం 0.5 శాతం పెంచకుండా అడ్డకొన్నది. దీంతో రాష్ట్రప్రభుత్వం రూ.25 వేలకోట్లు నష్టపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్రానికి ఎదురు నిలిచి పోరాడుతున్నది. రైతులపై కేసీఆర్ ప్రభుత్వ ప్రేమకు, చిత్తశుద్ధికి చంద్రబాబు తాజా వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.