హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణపై కోపం ఇంకా చల్లారనట్టుంది. అన్ని రంగాల్లో ఆగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ నీటివాటాపై కన్నేసిన చంద్రబాబు.. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు మరో అన్యాయం చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో ఉన్న జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్డీబీ)ను ఏపీకి తరలించేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే తన మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారుకు చంద్రబాబు మద్దతు అనివార్యం కాబట్టి, ఈ ప్రతిపాదనకు కేంద్రం ఒకే చెప్పే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో మోసం చేసినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2006లో హైదరాబాద్‌లో ఎన్ఎఫ్డీబీని నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇది దేశం మొత్తానికి ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్నది. ఆ తర్వాత అస్సాంలోని గౌహతి, ఒడిస్సాలోని భువనేశ్వర్‌లో రీజినల్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. దేశ మత్స్యరంగం అభివృద్ధిలో ఎన్ఎఫ్డీబీ కీలక పాత్ర పోషిస్తున్నది. ఇంత ప్రాముఖ్యం కలిగిన ఎన్ఎఫ్డీబీ హైదరాబాద్‌లో ఉండటంతో రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఇలాంటి రాష్ట్రంలో ఎన్ఎఫ్డీబీ ఉం డటం వల్ల మత్య్సరంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
రాష్ట్రంలో సాగునీటి గోస తీర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్ర సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు దోహదపడింది. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ ఈ జలాలను రాష్ట్రంలో మత్య్సరంగాన్ని అభివృద్ధి చేయడానికి, మత్స్యకారుల జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినియోగించాలని నిర్ణయించారు. ఉచిత చేపపిల్లల పంపిణీని పథకాన్ని అమలుచేశారు.
ఈ పథకం కారణంగా రాష్ట్రంలో 2014లో 2.6 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2023లో 4.39 లక్షల టన్నులకు పెరిగింది. దీనివల్ల ప్రతి సంవత్సరం మత్స్యకారులకు రూ.6,500 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఎఫ్డీబీ ఇక్కడినుంచి తరలిపోతే తెలంగాణ మత్య్సరంగానికి, మత్య్సకారులకు నష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై రాష్ట్ర మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏపీ మత్స్యరంగం, మత్య్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ మత్స్యరంగాన్ని బలిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డును ఆంధ్రప్రదేశ్‌కి తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని నారాయణపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్, గడిముంకన్పల్లి మాజీ సర్పంచ్ జీ సుభాష్, ఎంనోనిపల్లి మాజీ ఎంపీటీసీ గౌని శ్రీను హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా పరిశోధనలు చేయాలనే ఆలోచనతో హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఎన్ఎఫ్డీబీని అమరావతికి తరలించాలంటూ కేంద్ర మంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు.
చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం ద్వారా మత్స్యరంగం సమగ్రాభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు, ఉపాధి, పర్యాటకరంగాన్ని మెరుగుపరిచేందుకు హై దరాబాద్‌లో ఎన్ఎఫ్డీబీని ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులను నిర్మించారని, 40వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో మత్స్యకారులు ఉన్నారని, ఎన్ఎఫ్డీబీని ఏపీకి తరలించడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు.