హైదరాబాద్ జూన్ 24 (నమస్తే తెలంగాణ): మోదీ అండతో బనకచర్లను నిర్మించి గోదావరిని చెరబట్టి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలెందుకు? అని సీఎం రేవంత్‌రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నిజంగా రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, మెతుకు ఆనంద్, రవీందర్‌నాయక్, బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
గోదావరి జలాల వినియోగం, బనకచర్లపై కాంగ్రెస్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. అందుకే మొన్నటి క్యాబినెట్ భేటీలో తూతూ మంత్రంగా చర్చించి చంద్రబాబును చర్చలకు పిలవాలని నిర్ణయించడం దిక్కుమాలిన చర్య అని మండిపడ్డారు. ఆంధ్రా ప్రయోజనాల కోసం కొమ్ముకాసే ఓ వర్గం మీడియా బనకచర్ల అంశాన్ని తెలంగాణలోని పార్టీల మధ్య పంచాయితీగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ఇలాంటి తరుణంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. గోదావరి జలాలు తెలంగాణ ప్రజల బతుకుదెరువని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎన్నిసార్లు తట్టిలేపినా అధికార పార్టీకి సోయికి రాకపోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు.
మోదీ సహకారంతో ఏపీ సీఎం నదుల అనుసంధానం పేరిట గోదావరి-కావేరి లింక్‌ను తెరపైకి తేవ డం దుర్మార్గమని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారం ముగిసిన అధ్యాయమని అభివర్ణించారు. ‘గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకించింది.. మా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా 150 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకుంటున్నం.. ఒక్క చుక్క కిందికి వదలబోమని తేల్చిచెప్పింది’ అని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు చంద్రబాబు మాత్రం ఈ ముసుగులో తెలంగాణను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు మాయలో పడి రేవంత్ సర్కారు రాష్ర్టానికి తీరని నష్టం చేయవద్దని హితవు పలికారు. బనకచర్ల, కావేరి లింక్‌ను అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.
ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయంతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ఇప్పుడు చంద్రబాబు ఎత్తుగడలతో గోదావరి జలాల వినియోగంలోనూ రాష్ర్టానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరిచి బనకచర్లను అడ్డుకోవాలి. రేవంత్‌రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబుకు దాసోహం కావద్దు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టొద్దు
– జగదీశ్‌రెడ్డి
బనకచర్ల, గోదావరి జలాల విషయంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎంపీలు అవగాహన పెంచుకోవాలని జగదీశ్‌రెడ్డి సూచించారు. గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం, అక్కడి నాయకులు గోదావరి-కావేరి లింక్‌పై కేంద్రం వైఖరిని తప్పుపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఇదే తరహాలో మన రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు బనకచర్ల, కావేరి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.
గతంలో బీఆర్ఎస్ చేసిన కృషితో త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కాగా ముందే అప్రమత్తమైన చంద్రబాబు ట్రిబ్యునల్ రాకముందే గోదావరిలో 200 టీఎంసీల హక్కును పొందేందుకు ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. గోదావరిలో మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటని సన్నా యి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు.
బనకచర్ల అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవడంలో విఫలమవుతున్న రేవంత్ ప్రభుత్వం గోదావరి మిగులు జలాల తరలింపు విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నదని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు కేసీఆర్ గోదావరిపై మూడు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి నాగర్జునసాగర్ టెయిల్ పాండ్, అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించాలని ఏపీ సర్కారుకు ప్రతిపాదించారని గుర్తుచేశారు. కేవలం రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే చాలని సూచించారని చెప్పారు.
నల్లగొండ, మహబూబ్‌నగర్‌లోని కరువు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చని భావించి ఈ ప్రతిపాదనలను చేశారని స్పష్టంచేశారు. కానీ చంద్రబాబు మాత్రం తక్కువ ఖర్చుతో ఆంధ్రాకు గోదావరి జలాలను తరలించే అంశాన్ని పక్కనబెట్టి రూ.80 వేల కోట్లతో బనకచర్లను నిర్మించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని మండిపడ్డారు. దీని వెనుక తెలంగాణను శాశ్వతంగా ఎండబెట్టి గోదావరి జలాలను దోపిడీ చేసేందుకు కుతంత్రాలు దాగి ఉన్నాయని విరుచుకుపడ్డారు.
చంద్రబాబుకు మడుగులొత్తుతున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానంతో కేసీఆర్‌పై నిందలేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ సర్కారుకు ఊపిరిగా మారారని, అందుకే ఆయన చెప్పినట్టు గోదావరి జలాల తరలింపునకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా నోరుమూసుకొని ఆంధ్రాబాబుకు దాసోహమవుతున్నారని ధ్వజమెత్తారు.
గతంలో కేసీఆర్ చేసిన కృషి వల్ల త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది. కానీ ముందే అప్రమత్తమైన చంద్రబాబు ట్రిబ్యునల్ రాకముందే గోదావరిలో 200 టీఎంసీల హక్కు పొందేందుకు ఎత్తుగడ వేస్తున్నడు. గోదావరిలో మిగులు జలాలను వాడుకుంటే తప్పేమిటని సన్నాయి నొక్కులు నొక్కుతున్నడు.
– జగదీశ్‌రెడ్డి
బనకచర్ల విషయంలో కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించాలని, అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంతో పోరాటం చేయాలని జగదీశ్‌రెడ్డి సూచించారు. ఒక వేళ కాంగ్రెస్ సర్కారు పెడచెవిన పెడితే బీఆర్ఎస్ పార్టీయే కార్యాచరణ చేపడుతుందని ప్రకటించారు. ప్రజలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
రైతు భరోసాను కుదించి, రెండుసార్లు ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సంబురాలు ఎందుకు నిర్వహిస్తున్నదో అర్థం కావడంలేదని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు జరుపుకొంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో తెలంగాణలోని పల్లెల్లో 2014కు ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కరెంట్‌లేక, నీరందక, ధాన్యం కొనుగోలు చేసే నాథుడులేక రైతులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ మాత్రం ఓట్ల కోసం రైతుభరోసా పేరిట నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు.
‘లక్ష కోట్లు లబ్ధి చేకూర్చామని ప్రభుత్వం ప్రగల్బాలు పలుకుతున్నది.. రైతులంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డా? భట్టి విక్రమార్కనా? ఉత్తమ్కుమార్రెడ్డా? చివరికి రేవంత్‌రెడ్డా?’ అని ఎద్దేవా చేశారు. 20 లక్షల ఇండ్లు నిర్మించాకే ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో ఒక్క ఇల్లు కట్టని ప్రభుత్వం మూడేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామంటే ఎవరు నమ్ముతారు?’ అని దెప్పిపొడిచారు.