హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో పలకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మరో రూపంలో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఇప్పుడు మళ్లోసారి వలసవాద కుట్రలకు బలికావద్దు. గతం గాయాలనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నం. తిరిగి వలస వాద పాలకుల చేతిలో పడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదమున్నది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ‘చంద్రబాబు రోజూ కృష్ణానీళ్లను మళ్లించుకపోతున్నడు. దీన్ని కనీసం అడ్డుకోవటం కాదు కదా కనీసం ఇదేందని ప్రశ్నించే పరిస్థితిలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణకు శాశ్వతంగా న్యాయం జరగాలంటే మనం ప్రజలను తిరిగి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.
గతంలో ఎన్నడూలేనంత పజీతకు తెలంగాణ లోనవుతున్నదని ఆవేదన చెందారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ‘పందామా? కొట్లాడదామా?’ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నటికైనా తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్సేనని, ఆ బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తన భుజస్కంధాలపై వేసుకోవాలని హితబోధ చేశారు. గులాబీ శ్రేణులు మరో చారిత్రక చైతన్యానికి పూనిక వహించాలని ఉద్భోదించారు. ‘తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు బాధలను పూర్తిగా తొలగిపోయే విధంగా.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా, తెలంగాణ తనకు తాను నిలబడాలని పుట్టిందే మన పార్టీ. అటువంటి చారిత్రక పాత్రను పోషించడానికే సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సంసిద్ధులం కావాలి’ అని పిలుపునిచ్చారు..