తెలంగాణ కోసం.. తెలంగాణ సమాజంలోంచి ఉద్భవించి ఉజ్వల ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్ రజతోత్సవాలు జరుపుకోవడం సాధారణ విషయం కాదు. మిగతా పార్టీలు వేరు.. బీఆర్ఎస్ పుట్టుక, ప్రయాణం వేరు! మిగతా రాజకీయ పార్టీలకు 25 ఏండ్ల చరిత్ర కేవలం పార్టీ చరిత్రే అవుతది. కానీ బీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ జీవనయానం రెండూ ఒక్కటే!
– కేసీఆర్
14 నెలల్లోనే రైతులు, మహిళలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు, ఆఖరుకు గురుకులాల విద్యార్థులు కూడా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మన హయాంలో గురుకులాల్లో చదివిన మన బిడ్డలు ఉన్నతాధికారులుగా తయారైండ్రు. ఇప్పుడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరగని రోజు లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా 57 మంది అమాయక విద్యార్థులు చనిపోయిండ్రు. ఇందుకోసమా.. తెలంగాణ తెచ్చుకున్నది?
– కేసీఆర్
KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని పార్టీ అధినేత కేసీఆర్ అభివర్ణించారు. తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాలపాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఉద్బోధించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను సంపూర్ణంగా వేసుకుందామని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జడ్పీ మాజీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, బీఆర్ఎస్ నేత వంశీధర్‌రావు, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశ ప్రారంభం నుంచి కేసీఆర్ దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంసృతిక, రాజకీయ పరిణామక్రమాన్ని వివరించారు.
రాజుల కాలం నుంచి నిజాం రాజుల దాకా రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాలు.. తద్వారా ప్రజల్లో రగలిన చైతన్యాన్ని కేసీఆర్ సోదాహరణగా వివరించారు. నాటి హైదరాబాద్ సంస్థానం ఒక దేశంగా వెలుగొందిన తెలంగాణ, ప్రజాస్వామిక భారతదేశంలో విలీనమైన తర్వాత ఒక రాష్ట్రంగా కూడా తన అస్థిత్వాన్ని చాటుకోలేక పోవడం శోచనీయమని వాపోయారు. అందుకు రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి, నాటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అనుసరించిన కుట్రపూరిత రాజకీయాలను ఏకరువు పెట్టారు. ‘తెలంగాణ సమాజం అనుభవించిన భయంకరమైన గాయాలు, కష్టాలు, బాధలు ఒకనాటివి కావు. ఒకటిన్నర శతాబ్దం పాటు కొనసాగిన బాధల.. గాయాల చరిత్ర తెలంగాణది. రాచరిక పాలన నుంచి భూస్వాములు, గడీల దొరల పీడన అంతా ఒక పెద్ద దుఃఖం. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతుంటారు కానీ, తెలంగాణ చరిత్రను అర్థం చేసుకుంటే గుండె బరువెకిపోతది. నేను ఒక వ్యక్తిగా ఒక దశాబ్దం పాటు స్వయంగా ఆ క్షోభ అనుభవించిన. నలిగిపోయిన. నేను మొదలైననాడు తెలంగాణ వస్తదని ఒకరిలో కూడా విశ్వాసం లేకుండె’ అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఎకడ చూసినా తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో తన ఉద్యమ ప్రస్థానాన్ని వివరించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాంపాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తుచేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు. ‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగే అన్ని అర్హతలు ఉన్నయని మొదటి రాష్ర్టాల పునర్విభజన సంఘం (ఫజల్ అలీ కమిషన్) స్పష్టం చేసింది’ అని గుర్తుచేశారు. ‘ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను తుంగలో తొకింది నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా 1969 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ములీ రూల్స్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అదే ఇందిరాగాంధీ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని సవరించి మరీ ములీ రూల్స్ రద్దు చేసింది. ఇట్లా చెప్పుకొంటూ పోతే ఒక ద్రోహం కాదు. నీటి వాటాల కోసం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, పలు రకాలుగా తెలంగాణ హకులను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. వీటినుంచి కాపాడేందుకు నాడు ఒక నాయకుడు కూడా మాట్లాడలేదు’ అని గత స్థితిగతులను కేసీఆర్ వివరించారు.
‘తెలంగాణ సమాజం అనుభవించిన భయంకరమైన గాయాలు కష్టాలు , బాధలు ఒకనాటివి కావు. ఒకటిన్నర శతాబ్ద కాలంపాటు కొనసాగిన బాధలు, గాయాల చరిత్ర తెలంగాణది. రాచరిక పాలన నుంచి భూ స్వాములు, గడీల దొరల పీడన అంతా ఒక పెద్ద దుఃఖం. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటరు కానీ, తెలంగాణ చరిత్రను అర్థం చేసుకుంటే గుండె బరువెకిపోతది. నేను ఒక వ్యక్తిగా దశాబ్దం పాటు స్వయంగా ఆ క్షోభ అనుభవించిన. నలిగిపోయిన.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
‘నాడు కాంగ్రెస్ చేసిన, చేస్తున్న ద్రోహం ఒకవైపు.. మరోవైపు చంద్రబాబు సృష్టించిన కర్కశత్వం తెలంగాణను ఆగం చేసినయ్. చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో సహించలేక పోయిన. ఎట్లయితె అట్లాయే.. ఈ తెలంగాణ శతాబ్దాల గోసకు ఎకడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టవలసిందే అని గట్టి నిర్ణయం తీసుకున్న. ఒకడిగానే బయలుదేరిన. 1999 – 2000 సంవత్సరం నుంచి మొదలైన నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం 25 ఏండ్లకు చేరుకున్నది’ అని కేసీఆర్ వివరించారు. ‘తెలంగాణ సాధన ద్వారానే మన కష్టాలు తీరుతయని టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు నాకు ఆఫీస్ కూడా దొరకనియ్యలే. కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసం జలదృశ్యంలో ఆఫీస్ ఇస్తే దాన్ని కూల్చి వేసింది నాటి ప్రభుత్వం’ అని గుర్తుచేశారు. కానీ, ఇవ్వాళ తెలంగాణ గర్వించే వేదికగా ఈ తెలంగాణ భవన్‌ను ఏర్పాటు చేసుకున్నామని, దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయిస్తే అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మితమయ్యాయని చెప్పారు.
వలసాంధ్ర ముఖ్యమంత్రులుగా పని చేసినోళ్లు తెలంగాణను అన్నివిధాలా నాశనం చేసిండ్రు. అధికారం వాళ్ల చేతుల్లోనే.. మీడియా వాళ్ల చేతుల్లోనే.. మనకో దారీ, తెన్నూ లేదు.. కరెంటు లేదు.. బొంబాయి.. దుబాయ్ వలసలు.. తెలంగాణ పల్లెల్లో నెలకు మూడు పాడెకట్టెలు ఎందుకో అని గోరటి వెంకన్న లాంటి కవుల వలపోతలు.. గంజి కేంద్రాలు నడిపించిన గోస.. వీటిపై నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరు కూడా మాట్లాడలేక మౌనం దాల్చిండ్రు.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు కొంతమంది సన్ ఫ్లవర్ల లెక్క తిరుగుతుంటారని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కాగా వస్తాయని న్యాయనిపుణులు చెప్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఉద్భోదించారు.
‘2001 ఏప్రిల్ 27న పార్టీ ప్రారంభించే ముందే ఉద్యమ ప్రస్థానం ఎలా ఉండాలి? రాజకీయ పార్టీని ఎలా నడపాలి? తెలంగాణ ఎలా సాధించాలన్నదానిపై అనేక సమావేశాలు పెట్టుకున్నం. 27 మీటింగ్‌లు పెట్టుకున్నం. అనేక వర్గాలతో సమావేశాలు నిర్వహించినం. ఉద్యమం అంటే అనుమానాలు వ్యక్తం చేసేవాళ్లు. నిరాశానిస్పృహలతోనే ఉండేవారు. అలాంటి సందర్భంలో అనేక చర్చోపచర్చలు జరిగినయి. మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, రైతు సంఘాల నేతలు ఇలా అనేక మందితో చర్చలు జరిపినం. తెలంగాణ ఉద్యమానికి దారీతెన్నూ తెలియని సందర్భంలో పార్టీని పెట్టి, ఉద్యమం చేసినం. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉదృతం చేసినం’ అని కేసీఆర్ వివరించారు.
తెలంగాణ సమాజం చారిత్రక అవసరం దృష్ట్యా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ను నలిపివేయాలని అనేక కుట్రలు సాగినయి. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషిచేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాలపాలు కాకుండా.. గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా.. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా పార్టీ శ్రేణులు కృషి చెయ్యాలె.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
‘తెలంగాణలో ఆనాడు ఎక్కడ చూసినా విన్నా ‘నెత్తురు కారంది ఎక్కడ నా తెలంగాణలో.. నేలకు రాలకుండా ఉన్నదా తెలంగాణ జిల్లాలోనా’ అన్న పాట వినిపించేది. పోలీసులు నక్సలైట్ల ఏరివేత పేరుతో ఇండ్లలో ఉన్నవారిని కూడా తీస్కపోయి ఎన్కౌంటర్లు చేసేవాళ్లు. ఎన్కౌంటర్లు చేయవద్దని, ఒకవేళ పోలీసులకు ఏమైనా అనుమానాలుంటే అరెస్టు చేయాలని, కేసులు పెడితే కోర్టుల్లో చూసుకుంటారని నాటి పోలీసు అధికారులతో చెప్పిన. ఇంట్లో పడుకున్నవారిని, పనులు చేసుకుంటున్నవారిని కూడా నక్సలైట్లు అన్న ముద్ర వేసి ఎలా అరెస్టు చేస్తారని నాటి సీఎం చంద్రబాబునాయుడును కూడా ప్రశ్నించిన. ఆనాడు పెద్దపల్లికి చెందిన ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి కూడా చంద్రబాబును ఇదే విషయమై నిలదీసిండు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తనని కూడా చెప్పిండు’ అంటూ నాటి విషయాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రైతాంగానికి విద్యుత్తు చార్జీలు భారంగా ఉండేవని, తాను తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రైతులు ఇదే విషయాన్ని తన దృష్టికి తీసుకొస్తే తాను నేరుగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో చెప్పానని, ఎన్టీఆర్ అందరితో మాట్లాడి చివరికి తాను చెప్పినదానికి ఒప్పుకొన్నారని, అరకంగా అప్పటి వరకు రైతాంగంపై ఉన్న శ్లాబుల భారం తగ్గిందని కేసీఆర్ తెలిపారు. కానీ, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచబ్యాంకు సంస్కరణల పేరుతో మళ్లీ విద్యుత్తు చార్జీలను పెంచారని చెప్పారు. దీన్ని తాను అడ్డుకునే ప్రయత్నం చేశానని, ప్రభుత్వంలో ఉండే చంద్రబాబుతో కొట్లాడనని గుర్తుచేశారు. కానీ, చివరికి మోయలేని భారాన్ని రైతులపై మోపడంతో ఇక లాభం లేదనుకొని లేఖ రాశానని, అనేక పోరాటాలు, ఉద్యమాల తర్వాతనే తెలంగాణ వచ్చిందని వివరించారు.
నెత్తురు కారందెన్నడో నా తెలంగాణ పల్లెల.. నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో అని నాడు ప్రజల గోస మీద వినిపించిన పాట నన్నెంతగానో బాధించింది. తెలంగాణకు ఎవడు చేసిన పాపమిది? దానికి నిష్కృతి లేదా? అని నేను ఆలోచించేది. నక్సలైట్ పేరుతో ఇంట్ల పండుకున్నోళ్లను పట్టుకపోయి కాల్చి సంపుడు.. వాళ్ల ప్రజలను సంపుతుంటే నాటి తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా క్షోభ అనుభవించేటోళ్లు.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
‘రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే బంపర్ మెజారిటీ. అందులో ఎవరికీ అనుమానం అక్కల్లేదు’ అని కేసీఆర్ తేల్చిచెప్పారు. కేవలం 14 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని యావత్ తెలంగాణ సమాజం నిర్ధారణకు వచ్చిందని వివరించారు. ‘ఎన్నికలు వస్తయి.. పోతయి.. గెలుస్తం… ఓడుతం. బీఆర్ఎస్ది గెలుపోటముల ప్రయాణం కాదు. అందుకోసం బీఆర్ఎస్ పుట్టలేదు’ అని స్పష్టంచేశారు. ‘ తెలంగాణ సమాజం గెలుపు కోసం.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటమే బీఆర్ఎస్ లక్ష్యం’ అని పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం బయలుదేరిననాడు ఏ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేశామో అదే లక్ష్యం కోసం బీఆర్ఎస్ జీవితాంతం పనిచేస్తుందని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో మొదటి త్రైమాసికానికే రెవెన్యూ లాస్ రూ.15 వేల కోట్లు ఉన్నది. అది రూ.30 వేల కోట్లకు చేరుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నరు. ఇంత హీనమైన పాలన ఇంకెక్కడా ఉండది. పదేండ్లు అద్భుతంగ పాలించినం. ఏనాడూ ఈ దుస్థితి ఎదురుకాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రంగాలు పడకేసినయి. ప్రభుత్వాలు మారితే గత పాలన కంటే మెరుగ్గా చేయడమో, లేక పాత పథకాలనే కొనసాగించటమో ఆనవాయితీ. కానీ, రాష్ట్రంలో అదేమీ లేదు.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్