హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో చంద్రబాబు హాట్లైన్లో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ద్వారా కాంగ్రెస్ హైకమాండ్‌తో చంద్రబాబు మాట్లాడటం వల్లనే ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పెద్దలు సైలెంట్ అయ్యారని విమర్శించారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ మధ్య హాట్లైన్లో సంభాషణ కొనసాగుతుందని చెప్పారు. అందుకే రాహుల్‌గాంధీ ఏపీలో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడటం లేదని అన్నారు.
ఏపీలో కూడా ‘ఓటు చోరీ’ జరిగిందని ఈ విషయంపై రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది కేవలం ఏపీలో మాత్రమే అని జగన్ స్పష్టం చేశారు. పోలింగ్‌తో పోలిస్తే కౌంటింగ్ నాటికి 48లక్షల ఓట్లు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు.ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మాణిక్కం ఠాగూర్ ఏనాడైనా చంద్రబాబు గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు తనపై మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మాణిక్కం ఠాగూర్ ఏనాడైనా చంద్రబాబు గురించి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా, చంద్రబాబు చేసే స్కామ్‌లు కండ్లముందు కనిపిస్తున్నా కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం ఏమిటని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ వీధికి వెళ్లినా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, ఎటు చూసినా పర్మిట్ రూమ్‌లు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మార్పీ రేట్లకన్నా మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతుంటే ఏనాడైనా మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారా.? అని నిలదీశారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్, రాహుల్‌గాంధీ మధ్య హాట్‌లైన్ వల్లనే వారు మాట్లాడటం లేదని విమర్శించారు.