హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ కయ్యానికి కాలుదువ్విన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు వత్తాసు పలికారు. ఓ వైపు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో రగిలిపోతుంటే అవేమీ పట్టనట్టు జనసేన ‘నవ నిర్మాణ సభ’ను అడ్డుకోవడం సరికాదని సుద్దులు చెప్పారు. మరోవైపు టీడీపీ, బీజేపీ తెలంగాణపైకి పవన్‌ను బాణంలా వదిలారని ప్రచారం జరుగుతుండగా.. బాబు మాత్రం ప్రజలకు మంచి చేయడంలో నాయకులు పోటీ పడాలని ఉచిత సలహా ఇచ్చారు.
ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు నేతలు పోటీపడొద్దంటూ తెలంగాణ నేతలను హెచ్చరించేలా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏండ్ల సమయం గడిచిందని, తమకు ఎవరు మంచి చేశారో ప్రజలకు తెలుసునంటూ చెప్పుకొచ్చారు. అభివృద్ధిని లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలని, అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. తాను తమిళనాడుకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని, పవన్‌కల్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో పవన్‌కల్యాణ్‌పై కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘పవన్ ఎపిసోడ్ వెనుక స్టోరీ, డైరెక్షన్ బాబుదే’ అంటూ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నారు. ‘మీకు ముఖం చెల్లకే మీ సిపాయిని తెలంగాణపైకి పంపారు.. ఈ పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.. 2014లో మీకు పట్టిన గతే రానున్న రోజుల్లో మీ సిపాయికీ పడుతుంది’ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ‘వాళ్లని వీళ్లని పంపడం ఎందుకు? డైరెక్ట్‌గా మీరే రావొచ్చుగా బాబు.. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీచేస్తే ఏమైందో చూశారుగా.. వచ్చే ఎన్నికల్లో అంతకు మించి ఉంటుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఇక్కడ కాంగ్రెస్, ఏపీలో టీడీపీ ఫెయీల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పవన్‌కల్యాణ్‌ను రంగంలోకి దింపారు..’అని అభిప్రాయాలు వ్యక్తంచేశారు.