హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం 11 నుంచి 3 గంటల మధ్య ఇంటి నుంచి బయటికి రావొద్దని సూచించింది. ఏప్రిల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతోనే వాతావరణంలో అసాధారణ పరిస్థితిలు నెలకొంటున్నాయని నిపుణులు చెప్పారు.మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ , మేడ్చల్ మలాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశమున్నది. సోమవారం ములుగు, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
నేడు ఆకాశవాణి వజ్రోత్సవాలు
హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తేతెలంగాణ): ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వజ్రోత్సవాలను మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్నామని ఆఫీస్, ప్రోగ్రాం హెడ్లు హరిసింగ్, రమేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1950లో ఆకాశవాణి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిందని, అప్పటి నుంచి ప్రజాహిత కార్యక్రమాలను అందిస్తున్నదని చెప్పారు. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆకాశవాణి డైరెక్టర్ ప్రజ్ఞాపాలివాల్ గౌర్ వర్చువల్గా వజ్రోత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. వజ్రోత్సవాలకు సాహితీవేత్తలు, మేధావులు, విద్యార్థులు, రచయితలు హాజరుకావాలని కోరారు.