నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 16: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లను పోలీసులు కట్టడి చేశారు. ఎక్కడికక్కడ నిర్బంధించారు. అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరితే ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మాజీ ప్రజాప్రతినిధులను తెల్లవారుజామునే పోలీసులు అరెస్టు చేసి, ఠాణాలకు తరలించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొర్రెముల, వెంకటాపురం, కాచవాని సింగారం, ప్రతాపసింగారం మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న మాజీ సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా ముత్యంపల్లి మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హరీశ్‌కు మాజీ సర్పంచ్ల కృతజ్ఞతలు
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీలో గళమెత్తిన మాజీ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ సర్పంచ్ల సంఘం, జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచులకు బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి పట్టుబట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం బాధాకరమని సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ అన్నారు.ఎన్నోసార్లు మంత్రులు, అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి నిర్దిష్టమైన గడువులోగా చెల్లిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.