హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రైతులకు మూడు గంటలపాటు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచనలను రేవంత్‌రెడ్డి బయటపెట్టారని పలువురు కార్పొరేషన్ చైర్మన్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమాతో సంక్షేమ పథకాలను రద్దు చేసి రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తారని హెచ్చరించారు. రైతులకు ఉచిత విద్యుత్తు అవసరం లేదనడం రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వద్దంటారని మండిపడ్డారు. రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు గతంలో కంటే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని రేవంత్‌రెడ్డి మాటలతో స్పష్టమైందని రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే రేవంత్‌రెడ్డికి రైతుల కష్టం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రైతులకు ఎప్పటికైనా సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
దుర్మార్గపు ఆలోచన
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే రైతులపై విషం కకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును రద్దు చేయాలనే కాంగ్రెస్ దుష్ట ఆలోచనను రేవంత్‌రెడ్డి బయటపెట్టారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మండిపడ్డారు. రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులపై రేవంత్‌రెడ్డి విషం చిమ్ముతున్నారని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ విధాన నిర్ణయంగా భావిస్తున్నామని, వారికి అధికారం ఇస్తే రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తారని విమర్శించారు. రైతులను కించపరుస్తూ విషం చిమ్మిన రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రమాదంగా దాపురించిందని మండిపడ్డారు. రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ ఉచిత కరెంటు ఇచ్చి మేలు చేస్తుంటే.. తెలంగాణ బిడ్డగా గర్వించకపోగా రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ర్టాల్లో రైతులకు ఉచితంగా కనీసం మూడు గంటల కరెంటు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.
రైతులకు ప్రథమ శత్రువు కాంగ్రెస్
రైతులకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ రంజిత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఇండ్లల్లో 24 గంటల విద్యుత్తు ఉండాలి గానీ, రైతులకు ఉండొద్దా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను రైతులు గమనిస్తున్నారని, ఆ పార్టీకి రైతులే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతుల కరెంటు కష్టాలను కడతేర్చిన సీఎం కేసీఆర్ పాలన కావాలా? కటికచీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలో రైతులు తేలుస్తారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు.