హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల కోసం సంక్షేమ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదువుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు తమ పరిధిలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు లేని సమయంలో ఉన్న వసతులతోనే సేవలందించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని కొనియాడారు.
ప్రైవేట్ టీచర్లకు చట్టం తేవాలని తాను ఎంపీగా ఉన్న సమయంలో ప్రైవేట్ బిల్లును పార్లమెంటులో పెట్టానని గుర్తుచేశారు. న్యాయవాదులు, భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం దేశంలో మొట్టమొదటి సారిగా సంక్షేమ చట్టం తెచ్చినట్టు తెలిపారు.