హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నది. ఇప్పటివరకు ఉపాధి హామీ కూలీల వేతనాలను పూర్తిగా కేంద్రమే భరిస్తూ వచ్చింది. మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే పనులకు మాత్రం కేంద్రం 75%, రాష్ర్టాలు 25% చొప్పున నిధులు చెల్లించేవి. ఇకపై అన్నీ కలిపి కేంద్రం 60% ఇస్తే, మిగతా 40% నిధులను రాష్ర్టాలు భరించాలనే కొత్త నిబంధనను మోదీ సర్కారు తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడికి కనీస జీవనాధారంగా ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను మార్చి తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీ-జీరామ్-జీ) పేరుతో మోదీ సర్కారు కొత్త బిల్లు తెచ్చింది.
ఈ బిల్లులో తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా రాష్ట్రంపై ఏటా రూ.1,737 కోట్ల వరకు అదనపు భారం పడనున్నది. పనుల సంఖ్యను బట్టి ఈ భారం మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికే ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అప్పులతో పూడ్చుతూ వస్తున్న తెలంగాణకు.. మోదీ మోపిన అదనపు భారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వశాఖ నిర్వహించే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వెబ్సైట్లో తాజా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 51.96 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, మొత్తం 1.06 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరిలో యాక్టివ్‌గా 54.02 లక్షల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి 2021-22లో 14.25 కోట్ల పనిదినాలు మంజూరు కాగా, 2025-26లో 7.5 కోట్ల పనిదినాలనే కేటాయించింది. ఉపాధి కూలీల పనిదినాలను ఏటా తగ్గించుకుంటూ వస్తున్న మోదీ సర్కారు.. తాజాగా నిధులు ఇచ్చే బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటున్నది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 12 కోట్ల పనిదినాల నిర్వహణ కోసం కేంద్రం రూ.3,834 కోట్లు విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర వాటా కలిపి రూ.4,645 కోట్లు అందుబాటులో ఉండగా, రూ.4,344 కోట్లు ఖర్చు చేశారు. కూలీల వేతనాల కోసం రూ.2,612 కోట్లు, మెటీరియల్, స్కిల్డ్ లేబర్ రూ.232 కోట్లు, పరిపాలన, నిర్వహణ వ్యయం రూ.1,500 కోట్లు వెచ్చించారు. మెటీరియల్ నిధుల్లో రాష్ట్ర వాటాగా రూ.350 కోట్లే చెల్లించింది. మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఇకపై రాష్ర్టాలకు ఇలా కుదరదు. కొత్తగా తెచ్చిన వీబీ-జీరామ్-జీ పథకంలోని నిబంధనల ప్రకారం మొత్తం నిధుల్లో (రూ.4,344 కోట్లలో) 40% అంటే రూ.1,737 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటివరకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ భారీ మొత్తం శరాఘాతంగా మారనున్నది. ఒక్కసారిగా ఉపాధి పనులకే రూ.1,200 కోట్లకు పైగా అదనపు భారం కానున్నది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడులు నవంబర్ నాటికి బడ్జెట్ అంచనాలో 30 శాతానికే చేరగా, అప్పులు మాత్రం 107.52 శాతాన్ని దాటాయి. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ వ్యయాలకు మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చడానికి అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఉపాధి నిధులకు రాష్ట్రవాటాగా 40% నిధులను జమచేయాల్సి ఉంటుంది. అలా జమచేస్తేనే మిగతా 60% వాటాగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర వాటా సకాలంలో సమకూర్చని పక్షంలో పథకం అమలు ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో నిలిచిపోయాయి. ఇప్పుడు ఉపాధి కూలీలకు 15 రోజులకు ఒకసారి కూలి డబ్బులు చెల్లిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉపాధి నిధుల వాటా నుంచి కేంద్రం తప్పుకోవడం, రాష్ట్రం సకాలంలో చెల్లించని పక్షంలో ఉపాధి పథకానికి కూడా ఉరి పడనున్నది.
