హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో పని చేస్తున్న 17 మంది న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు, ఏపీ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలో చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్టు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా బుధవారం ప్రకటించారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మన్నూరి లక్ష్మణ్ రాజస్థాన్‌కు, జస్టిస్ జీ అనుపమ చక్రవర్తి పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీ మానవేంద్రనాథ్ రాయ్ గుజరాత్‌కు, అదనపు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణను మధ్యప్రదేశ్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేంద్రజీ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టుకు న్యాయవాదుల కోటా నుంచి హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి కనపర్తి, సుమతి జగదం, న్యాపతి విజయ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరితో శుక్రవారం ఆ రాష్ట్ర సీజే ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర హైకోర్టులో సీజేతో కలిపి 42 మంది న్యాయమూర్తుల పోస్టులకు ప్రస్తుతం 30 మంది ఉన్నారు. ఇద్దరు బదిలీతో ఆ సంఖ్య 28కి చేరింది. మరో 18 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇప్పటికే జస్టిస్ చిల్లకూరు సుమలత, జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్‌ను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరి బదిలీల ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.