హైదరాబాద్, ఫిబ్రవరి 26 : ప్రభుత్వానికి పంగనామం పెట్టాలి.. ప్రైవేటుకు పరమాన్నం పెట్టాలి.. దేశాన్ని దోచుకోవాలి.. దేశ సంపదను లూటీ చేయాలి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న విధానమిది. ప్రభుత్వ ఆస్తులను ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తున్న మోదీ ప్రభుత్వం.. విద్యుత్తు చట్టాన్ని సక్కదిద్దుతామని చెప్పి కార్పొరేట్‌కు కరెంటు వ్యవస్థను అప్పగించే కుట్ర చేస్తున్నది. విద్యుత్తు చట్ట సవరణ ద్వారా పంపిణీ వ్యవస్థలో ప్రైవేటురంగానికి ద్వారాలు తెరుస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా వాటి ఆస్తుల అమ్మకానికి లక్ష్యాలు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మూడు ప్రతిష్టాత్మక విద్యుత్తు సంస్థలు తమ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాయి. దీంతో రాష్ర్టాల్లోని విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా (ట్రాన్స్మిషన్) వ్యవస్థలు కూడా ప్రైవేటుపరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం ఆధ్వర్యంలోని ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సంస్థలు నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ) ప్రణాళికలో భాగంగా తమ జలవిద్యుత్తు, పునరుత్పాదక ఇంధన పంపిణీ వ్యవస్థలు, ఇతర ఆస్తుల నుంచి గరిష్ఠ విలువను పొందేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించాయని కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ వెల్లడించారు.
ఓ కంపెనీని నెలకొల్పి, అందులోకి వాటాలను మళ్లించడం, మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్‌లు (ఇన్విట్స్) నెలకొల్పడం, క్యాష్‌ఫ్లో మానిటైజేషన్ వంటివి ఆ ప్రణాళికలో ఉన్నాయని వివరించారు. ఎన్ఎంపీ కింద విద్యుత్తు రంగానికి చెందిన 14 శాతం ఆస్తులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో రూ.45,200 కోట్ల విలువైన 28,608 సర్క్యూట్ కిలోమీటర్ల పరిధిలోని ఆస్తులు విద్యుత్తు పంపిణీ వ్యవస్థ కింద ఉన్నాయి. అలాగే జలవిద్యుత్తుకు చెందిన ఆరు గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల ప్రాజెక్టులు, రూ.39,832 కోట్ల విలువైన పునరుత్పాదక ఇంధన వనరుల ఆస్తులు ఉన్నాయి. కొన్ని చోట్ల కంపెనీలను నెలకొల్పి వాటాలను బదలాయిస్తామని, మరికొన్ని చోట్ల ఇన్విట్స్‌ను నెలకొల్పి ఎన్ఎంపీని అమలు చేస్తామని అలోక్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల విలువకు నష్టం లేకుండా చూడటమే ఈ విధానాల ప్రాథమిక లక్ష్యమని అన్నారు. ఎన్ఎంపీ ప్రకారం ప్రభుత్వం తమకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించిందని తెలిపారు. ఆ లక్ష్యాలను ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, పీజీసీఐఎల్ చేరుకోవాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం ఆ మూడు సంస్థలు సమగ్ర ప్రణాళికలను రూపొందించాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే నీతి ఆయోగ్, ఆర్థికమంత్రిత్వ శాఖతో పలుమార్లు సమావేశమయ్యామని చెప్పారు.
ఊగిసలాటలో రాష్ర్టాల విద్యుత్తు సంస్థల భవిష్యత్తు
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా రాష్ర్టాల్లోని విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, విద్యుత్తు సరఫరా (ట్రాన్స్మిషన్) వ్యవస్థలను కూడా ప్రైవేటైజేషన్ దిశగా మళ్లించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీపీసీ ఎన్‌హెచ్‌పీసీ, పీజీసీఐఎల్లు తమ ఆస్తుల నుంచి గరిష్ఠ విలువను పొందేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో రాష్ర్టాల్లోని విద్యుత్తు సంస్థల భవిష్యత్తు డోలాయమానంలో పడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టాల్లోని డిస్కంలను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా సంఘటనతో.. ఇకపై రాష్ట్రల్లోని విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు (జనరేషన్), సరఫరా (ట్రాన్స్మిషన్) సంస్థలనుకూడా ఇదే తరహాలో ప్రైవేటీకరించేందుకు మార్గం ఏర్పాటు చేసిందని వారంటున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా పీజీసీఐఎల్ కూడా బిల్డ్, ఆపరేట్, లీజ్, ట్రాన్స్ఫర్(బోల్ట్) పద్ధతిలోకి మారే అవకాశం ఉందని వారంటున్నారు. రాష్ర్టాల్లోని జెన్కో, ట్రాన్స్‌కో సంస్థలు కూడా ఇదే బాటలో నడిచేలా పరిస్థితులను సృష్టించేందుకు ఇది దోహదపడుతుందని వారంటున్నారు.
ఇన్విట్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్)లు ఆదాయాన్ని సృష్టించే మౌలిక సదుపాయాల సంస్థలను నిర్వహిస్తాయి. ఆ సంస్థలు లేక ఆస్తుల ద్వారా పెట్టుబడిదారులకు నికరంగా లాభాలను చేకూర్చే అవకాశాలను కల్పిస్తాయి. ఆ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో వాటాల కొనుగోలు, అమ్మకాలకు సహకరిస్తాయి. ప్రభుత్వరంగ సంస్థలు తమకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయంగా నిధులు సమీకరించుకొనేందుకు ప్రభుత్వమే ఈ ఇన్విట్ విధానాన్ని ప్రతిపాదించింది.