రైతుల ఆదాయం రెట్టింపు మాట బూటకమే
దేశవ్యాప్తంగా దిగజారిన రైతుల ఆదాయం
తేల్చిచెప్పిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
హైదరాబాద్, మార్చి 26: వ్యవసాయరంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వ చాతకాని తనాన్ని పార్లమెంటరీ వ్యవసాయ స్టాండింగ్ కమిటీ ఎత్తిచూపిందని చెప్పారు. బీజేపీ సీనియర్ ఎంపీ గాడిగౌడర్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ గురువారం విడుదల చేసిన నివేదికతో కేంద్రం ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం అయ్యాయని తెలిపారు. ఈ మేరకు వినోద్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో వ్యవసాయరంగం ఎదురొంటున్న సమస్యలు, రైతుల స్థితిగతులను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లిప్త, నిరాసక్త వైఖరిని ధైర్యంగా వెల్లడించిన గాడిగౌడర్ను అభినందించారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయని దెప్పిపొడిచారు.
ప్రధాని మాటలు బూటకమే అని ఈ నివేదికతో తేలిపోయిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో అన్నదాతల ఆదాయం మరింత దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) 77వ రౌండ్ డాటా 2021లో విడుదలచేసిన నివేదికను కమిటీ ఊటంకించిందని గుర్తుచేశారు. ఈ నివేదిక అంచనాల ప్రకారం.. 2022లో ప్రతి నెలా రైతుల ఆదాయం రూ.12,445 ఉంటుందని పేరొన్నదని, అసలు లక్ష్యం రూ.21,146 అని, కానీ కేంద్ర విధానాల వల్ల రైతుల ఆదాయం ఎండమావిగానే మారిందన్నారు. రైతుల కోసం ఖర్చుచేయాల్సిన రూ.67,929.10 కోట్లను వ్యవసాయ శాఖ నాలుగేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసిందని, ఇది అత్యంత దారుణమని కమిటీ తప్పుబట్టిందని వివరించారు. ఏడేండ్ల బీజేపీ పాలనలో రైతులకు ఏ రకంగానూ మేలు జరగలేదని, భవిష్యత్తుపైనా ఆశ లేదని కమిటీ నివేదికతో తేలిపోయిందని అన్నారు. స్టాండింగ్ కమిటీ నివేదికపై బీజేపీ రాష్ట్ర నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగగా మార్చారని, రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని చెప్పారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు పుషలంగా నీళ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.