న్యూఢిల్లీ, మే 13 : వానకాలం పంటలకు కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ధాన్యంపై మరో రూ.72 పెంచింది. వచ్చే సీజన్లో ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441 చెల్లించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రుతుపవనాల రాకతో జూన్ నుంచి మొదలయ్యే వానకాలం సీజన్‌కు గాను మొత్తం 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యం క్వింటాల్ సాధారణ రకానికి రూ.2,441, ఏ గ్రేడ్ రకానికి రూ.2,461 ప్రకటించింది.
పత్తి మీడియం రకంపై రూ.557 పెంచి క్వింటాల్‌కు రూ.8,267గా నిర్ణయించింది. మరో రకానికి రూ.8,667గా నిర్ణయించింది. అత్యధికంగా పొద్దుతిరుగుడు గింజల ధరను రూ.622 పెంచింది. క్వింటాల్‌కు రూ.8,343గా నిర్ణయించింది. గడ్డి నువ్వుల ధరను క్వింటాల్‌కు రూ.515 పెంచి రూ.10,052గాను, నువ్వుల ధరను రూ.500 పెంచి రూ.10,346గాను నిర్ణయించింది. వేరుశనగ క్వింటాల్ ధర రూ.7,517కు పెరిగింది. మక్కజొన్నలపై మద్దతు ధరను కేవలం రూ.10 మాత్రమే పెంచి రూ.2,410గా నిర్ణయించింది.