జాతీయ రహదారులకు అత్యధిక నిధులు అటే
తెలంగాణకు బీజేపీ సర్కారు తీవ్ర అన్యాయం
బీజేపీ రాష్ర్టాలతో పోల్చితే సగం కూడా ఇవ్వని వైనం
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. 2018-19 నుంచి 2020-21 వరకు మూడేండ్లలో తెలంగాణకు రూ.7,993 కోట్లు ఇచ్చిన కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకకు రూ.17,240 కోట్లు, గుజరాత్‌కు రూ.18,874 కోట్లు, హర్యానాకు రూ. 24,335 కోట్లు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.11,983 కోట్ల వ్యయంతో 3,150 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేసిన కేంద్రం, ఇందులో నిధులు మంజూరు చేసింది మాత్రం 2,169 కిలోమీటర్లకే. ఇప్పటికీ 1,739 కిలోమీటర్ల పనిని పూర్తి చేయగా, ఇంకా 430 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉన్నది. ఇవి కాకుండా రూ.13 వేల కోట్ల వ్యయం కాగల జాతీయ రహదారి పనులకు అనుమతివ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరగా, కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదు.