హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాచిక పారింది. బాబు ఫార్ములా అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీ సర్కార్ చేపట్టిన ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టు అనుమతులకు చకచకా అడుగులు వేస్తున్నది. కర్ణాటక సర్కార్ తుంగభద్రకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నావలి రిజర్వాయర్‌ను విస్తరించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఆయా అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రణాళికలతో తెలంగాణకు, అందులో పాలమూరుకు తీరని ప్రమాదం పొంచి ఉన్నా, చంద్రబాబు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జీ హుజూర్ కొట్టడమేకాదు, రాష్ర్టానికి ఎంతో ప్రయోజనమంటూ అబద్ధాలకు తెరతీశారు.
ఇటీవల తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నదీ జలాల అంశంపై చర్చించుకోవడంతోపాటు సమస్యల పరిష్కారం బాధ్యతను కేంద్రానికి రాష్ర్టాల సీఎంలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు నేతృత్వం వహిస్తారు. కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు, సీడబ్ల్యూసీలోని నాలుగు విభాగాల చీఫ్ ఇంజనీర్లు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి, మెంబర్ సెక్రటరీ మొత్తంగా తొమ్మిది మందిని నియమించింది.
ఆర్డీఎస్ దిగువన నీటి వినియోగం, నిర్వహణ ఇబ్బందులు, తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం, తద్వారా సాగు, తాగునీరు, జలవిద్యుత్తు ఉత్పత్తిపై పడిన ప్రభావాన్ని, అదేవిధంగా పూడిక తొలగింపు అవకాశాలు, అందుకు అయ్యే వ్యయం, పూడిక నివారణకు చేపట్టగలిగే చర్యలతోపాటు నావలి రిజర్వాయర్‌ను విస్తరించాల్సిన ఆవశ్యకత ఉన్నదా? లేదంటే, తుంగభద్ర డ్యామ్‌లో పూడిక తీస్తే సరిపోతుందా? రెండింటిలో ఏదీ ప్రయోజనకరమైనది? నావలి రిజర్వాయర్ విస్తరణతో దిగువకు నిర్దేశిత మేరకు జలాలు విడుదలవుతాయా? ట్రిబ్యునల్ అవార్డుల మేరకు ఆయా రాష్ట్రాలకు వాటా జలాలు అందుతాయా? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని నిర్దేశించింది. వాటిపై సమగ్ర నివేదికను ఆరు నెలల్లోగా అందించాలని కమిటీకి మార్గదర్శకాలు జారీ చేసింది. అవసరమైతే ఆయా అంశాల అధ్యయనానికి ఉప కమిటీలను ఏర్పాటు చేసుకొనే, ప్రత్యేక నిపుణులను నియమించుకొనే వెసులుబాటును కమిటీకి కేంద్ర జల్‌శక్తి శాఖ కల్పించింది. మొత్తంగా కీలక అడుగు వేసింది.
తెలంగాణ రైతులకు దక్కాల్సిన నదీ జలాలను కొల్లగొట్టేందుకు కేంద్రాన్ని గుప్పిటపెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు కొంతకాలంగా కొత్త కుట్రలకు తెరతీశారు. అందులో భాగంగా 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలిస్తామంటూ రూ.81 వేల కోట్లతో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ కుట్రను బీఆర్ఎస్, నమస్తే తెలంగాణ బట్టబయలు చేయడం, కేంద్ర సంస్థలు సైతం ఆ ప్రణాళికలకు అనేక కొర్రీలు పెట్టడంతో రూటుమార్చారు. బనకచర్లకు బదులు, నల్లమలసాగర్‌కు తరలిస్తామంటూ కొత్త ప్రతిపాదనలతో ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వచ్చారు. అయితే ఆ పాచిక సైతం పారలేదు. దీంతో ఇక ఇప్పుడు కేంద్రాన్నే రంగంలోకి దించారు. నదుల అనుసంధానం పేరిట బనకచర్లను సాధించుకొనేందుకు పావులు కదుపుతున్నారు.
కేంద్రాన్నే ముందుకు నెట్టి ప్రస్తుతం తన బనకచర్ల ప్రణాళికల అమలుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే, నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా దక్కాల్సిన నీటి వాటాపై పేచీ పెడుతున్న కర్ణాటక సర్కార్‌ను ఒప్పించేందుకు కేంద్రమే మధ్యవర్తితత్వం వహించింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌కు ఎన్వోసీ జారీ చేయాలని, తద్వారా బనకచర్లకు అనుమతులిస్తామంటూ కేంద్రమే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు, పోలవరం నుంచి గోదావరి జలాల డైవర్షన్ ద్వారా వచ్చే 16 టీఎంసీలను వినియోగించుకొనేందుకు ఎగువన బెడ్తి-వర్ద లింకును, దాంతోపాటుగా నావలి రిజర్వాయర్ విస్తరణకు నిధుల సాయం చేస్తామని కర్ణాటక రాష్ర్టానికి నజరానాలు ప్రకటించింది.
ఆయా అంశాలపై ఇటీవల తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సమక్షంలోనే ముగ్గురు సీఎంలు చర్చించుకున్నారు. సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. సమావేశం అనంతరం కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎంలు వెల్లడించిన విషయాలే దీనిని రూఢీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు రూట్ క్లియర్ చేసేందుకే, ప్రస్తుతం నావలి రిజర్వాయర్ అంశంపై అధ్యయనానికి కేంద్ర జల్‌శక్తి శాఖ హైలెవల్ కమిటీ వేసినట్టు స్పష్టమవుతున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వింటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి ప్రాజెక్టుకు అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులపై సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న దిండి, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొనేందుకు, సమస్యలను పరిషరించుకొనేందుకు పక రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సంపూర్ణమైన అనుమతులను సాధిస్తామని వెల్లడించారు.

ఓ వైపు కృష్ణానది జలాలను ఎత్తుకుపోయేందుకు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ ఏపీ, కర్ణాటక చకచకా పావులు కదుపుతున్నాయి. మరోవైపు ఇప్పటికే తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశించే ప్రాంతం.. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడి వద్ద కృష్ణా-భీమా నదుల సంగమ ప్రదేశం నీళ్లులేక ఇలా వెలవెలబోతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు ఏపీ, కర్ణాటక ప్రాజెక్టుల మూలంగా తెలంగాణకు
కృష్ణా జలాలు మొత్తానికే దక్కకుండా పోతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలను సమకూర్చడంలో తుంగభద్ర అత్యంత కీలకం. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం ఎగువన ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మించి జలాలను వినియోగించుకొంటున్నది. నావలి సహా మరిన్ని బరాజ్‌ల నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తున్నది. మరోవైపు, ఏపీ రాష్ట్రం సైతం తుంగభద్ర డ్యామ్ లోలెవల్ కెనాల్‌కు సమాంతర కాలువను తవ్వి వరద జలాలను మళ్లించుకొనేందుకు, అదేవిధంగా గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి పావులు కదుపుతున్నది. ఆయా ప్రాజెక్టులు తెలంగాణ జల హక్కులకు గొడ్డలిపెట్టు.
రాబోయే రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు తుంగభద్ర జలాల రాక గణనీయంగా తగ్గిపోతుంది. తద్వారా ఆ రిజర్వాయర్‌పైనే ఆధారపడిన పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతలకు తీరని ప్రమాదం పొంచి ఉన్నది. అదీగాక నావలి రిజర్వాయర్‌కు జలాల కేటాయింపును ట్రిబ్యునల్ గతంలోనే తిరస్కరించింది. తుంగభద్రపై ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక షరతులు విధించింది. ఎగువ రాష్ర్టాల ప్రణాళికలతో తెలంగాణకు తీరని ముప్పు పొంచి ఉన్నా, ట్రిబ్యునల్, కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం జై కొడుతున్నారు.
గురువు చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలను పణం పెడుతూ, నయవంచక ప్రతిపాదనలకు సిద్ధమవుతున్నారనే విమర్శలొస్తున్నాయి. పాలమూరుకు ఎన్వోసీ సాధిస్తామంటూ నమ్మబలుకుతూ గుట్టుగా చర్చలు సాగిస్తూ తెలంగాణ జలహక్కులను పొరుగు రాష్ర్టాలకు తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవంగా నదీ జలాల్లో వాటాలను, రాష్ర్టాల హక్కులను ట్రిబ్యునళ్లు నిర్ధారిస్తాయి. ఇదిలా ఉంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం అంతర్రాష్ట్ర జల వివాదాలను ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు కేంద్ర మంత్రి నేతృత్వంలోని అత్యున్నతస్థాయి అపెక్స్‌లో చర్చించుకోవాలి. అందులోనే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, ప్రస్తుతం చట్టబద్ధమైన ట్రిబ్యునల్, అపెక్స్ కౌన్సిల్ ఊసే లేకుండా దొడ్డిదారిన రేవంత్‌రెడ్డి సర్కార్ ఏపీతో చర్చలు, ఒప్పందాలకు సిద్ధమవడం గమనార్హం.
ఇదంతా చంద్రబాబు కోసమేననే ఆరోపణలున్నాయి. బనకచర్లను అంగీకరించేది లేదంటూ గతంలోనూ ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఆ తరువాత ప్రాజెక్టుపై చర్చలు జరుపడమేకాదు, వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఇటీవల కర్ణాటకలో మరోసారి భేటీ అవగా, తాజాగా కేంద్రం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఈఎన్సీని సైతం అందులో చేర్చింది. ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ జల హక్కులకు సీఎం రేవంత్‌రెడ్డి శాశ్వత సమాధి కట్టేందుకు సిద్ధమయ్యారని ఇంజినీర్లు, తెలంగాణ నీటిరంగ నిపుణులు సైతం అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.