బియ్యం, నూకల ఎగుమతులపై తప్పుడు సమాచారం
డబ్ల్యూటీవో ఆంక్షలు లేకపోయినా ఉన్నట్టుగా ప్రచారం
బాయిల్డ్‌రైస్‌ను కాదని రా రైస్ కోసం మంకుపట్టు
పార్లమెంటులో బట్టబయలైన కేంద్ర మంత్రి నైజం
హైదరాబాద్, ఏప్రిల్ 2 : ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు. తాజాగా శుక్రవారం పార్లమెంటులోనూ అసత్యాలు మాట్లాడారు. బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని చెప్పడం, ఎగుమతులకు డబ్ల్యూటీవో ఆంక్షలు అడ్డొస్తున్నాయనడం, ధాన్యం సేకరణ నిమిత్తం కేంద్రం రాష్ర్టాలకు అడ్వాన్స్‌గా 90 శాతం నిధులు ఇస్తున్నట్టు చెప్పుకోవడం పచ్చి అబద్ధాలు.
అబద్ధం-1
బియ్యం, నూకల ఎగుమతికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదు.
వాస్తవం: పీయూష్ గోయల్ చెప్పిన దానికి భిన్నంగా మన బియ్యం, నూకలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ లైన్’ ఈ నెల 29న అంతర్జాతీయ మార్కెట్లో నూకలకు ఉన్న డిమాండ్‌పై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చైనా, వియత్నాం, ఇండోనేషియా తదితర దేశాలు నూకల కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాయి. గతంలో క్వింటా నూకల ధర రూ.1,600-1,700 ఉండగా ప్రస్తుతం రూ.2,200కు పెరగడం డిమాండ్‌కు అద్దం పడుతున్నది. ఈ పరిస్థితుల్లో కేంద్రం తెలంగాణ నుంచి నూకలు, బియ్యం కొనుగోలు చేసి ఎగుమతి చేయొచ్చు కదా? ఆ దిశగా కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
అబద్ధం-2
ఎగుమతులపై డబ్ల్యూటీవో ఆంక్షలున్నాయి
వాస్తవం: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఆంక్షలు కొన్ని అంశాలకే పరిమితం. డబ్ల్యూటీవో ఆంక్షల ప్రకారం ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం కొనుగోలుచేసిన ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేయడానికి వీలుండదు. కానీ, ఇతర మార్గాల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులపై ఆంక్షలు లేవు. పీడీఎస్‌కు వర్తించే నిబంధనను బూచిగా చూపి, ఎగుమతులు చేసే అవకాశమే లేదన్నట్టుగా కేంద్రం ప్రచారం చేస్తున్నది. ఒకవేళ నిజంగానే ఆంక్షలు ఉంటే వాటిని సడలించేందుకు డబ్ల్యూటీవోపై కేంద్రం ఎందుకు ఒత్తిడి తేవడం లేదు?
అబద్ధం-3
ధాన్యం సేకరణకు అవసరమయ్యే నిధుల్లో 90 శాతం రాష్ర్టాలకు ముందుగానే ఇస్తున్నాం.
వాస్తవం: గోయల్ చెప్పినట్టుగా కేంద్రం ఏ రాష్ర్టానికి కూడా ధాన్యం కొనుగోలుకు ముందుగానే డబ్బులు చెల్లించడం లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, రైతులకు చెల్లిస్తున్నాయి. సీఎమ్మార్(బియ్యం) అందజేసే సయమంలో కేంద్రం రాష్ర్టాలకు డబ్బులు చెల్లిస్తున్నది.
అబద్ధం-4
రా రైస్ మాత్రమే కొనుగోలు చేస్తాం.
వాస్తవం: కొన్ని ఏండ్లుగా యాసంగిలో కేంద్రం రాష్ట్రం నుంచి బాయిల్డ్ రైస్‌నే కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు అకస్మాత్తుగా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని, రా రైస్ కావాలని పట్టుపడుతున్నది. ఉత్పత్తి అయ్యే బాయిల్డ్‌రైస్‌ను పక్కనబెట్టి ఉత్పత్తి కాని రారైస్‌ను అడగడం కేంద్రానికే చెల్లింది.