హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీతో జోడీ కట్టాయి. ఆ పార్టీ నేతలు ఎలా చెప్తే అలా సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు తోక ఆడిస్తున్నాయి. ఆ సంస్థలకు బీజేపీ గల్లీ లీడర్లు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలి ఘటనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ అక్రమ సంబంధం వల్ల ఆయా సంస్థల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టే రహస్య విచారణల గురించి రాష్ర్టాల్లోని బీజేపీ గల్లీ లీడర్లు ‘చిలక జోస్యం’ మాదిరిగా ముందే చెప్పడం.. ఆ మరుసటి రోజే సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగడం పరిపాటిగా మారడం ఇందుకు కారణం.
నిరుడు ఆగస్టు 21న ఢిల్లీలో బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా సంయుక్త మీడియా సమావేశంలో మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. వాస్తవానికి అప్పటికి సీబీఐ దర్యాప్తు తెలంగాణ వరకు రాలేదు. అయినా వారు బాహాటంగా కవిత పేరును ప్రస్తావించడం గమనార్హం. కవిత చుట్టూ కుట్ర జరిగిందనడానికి వారి మాటలే నిదర్శనం.
‘మద్యం కుంభకోణంలో కవిత తప్పు లేకపోతే 10 ఫోన్లను ఎందుకు పగలగొట్టుకున్నది?’ అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నిరుడు ఆగస్టులో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా వ్యాఖ్యానించారు. తద్వారా ఆ ఫోన్ల గురించి ఈడీ ఆరా తీయనున్నదని, ధ్వంసమైన ఫోన్లలోని సమాచారాన్ని సేకరించిందని మీడియాకు హింట్ ఇ చ్చారు. దీంతో దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న ఆయా ఫోన్ల వివరాలు, వాటి ఐఎంఈఐ నంబర్లు బీజేపీకి అనుకూల చానల్లో ప్రసారమయ్యాయి.
‘ఆమె (కవిత)నే ప్రైవేట్ జెట్ల పోయింది. ఢిల్లీలో మీటింగులల్ల కూర్చున్నది. మద్యం కుంభకోణంలో ఆమె హస్తమున్నది. ఈ కుంభకోణం వల్ల ఢిల్లీ ప్రభు త్వం రూ.6-7 వేల కోట్లు నష్టపోయినట్టు మాకు సమాచారం ఉన్నది. దీనిపై విచారణకు గమ్మున కో-ఆపరేట్ చెయ్యాలిగానీ, కోర్టులకెందుకు పోపుడు’ అంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నిరుడు సెప్టెంబర్ 5న మీడియాతో మాట్లాడారు. తద్వారా ఢిల్లీ లిక్కర్ స్కాం పరిమాణం రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు ఉంటుందని సీబీఐ, ఈడీలు నిగ్గు తేల్చక ముందే చెప్పారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కాం వి లువను లెక్కకట్టింది ఈ ఘనాపాటీలేనని తేలుతున్నది. లేని స్కాంను ఉన్నట్టుగా పదిసార్లు చెప్పి కుంభకోణం నిజమేనన్న భ్రమలు కల్పించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఇప్పుడు స్పష్టమవుతున్నది.
‘కేసీఆర్ గారాల కూతురు, ఎమ్మెల్సీ కవిత నేడో రే పో జైలు పాలు అవక తప్పదు’ అంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ నెల 4న పవిత్రమైన తిరుమల సన్నిధిలో రాజకీయాల గురించి మాట్లాడారు. ఆయన ఆ మాట అనగానే 6వ తేదీ నుంచే రామచంద్ర పిైళ్లె అరెస్టుకు రంగం సిద్ధం చేసిన ఈడీ అధికారులు.. 7న ఆయనను అరెస్టు చేశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని బీజేపీ భరించలేకపోతున్నది. అందుకే ఢిల్లీలో జరిగిన స్కాంను గోవా, పంజాబ్ ఎన్నికలకు ముడిపెట్టి బురద జల్లే ప్రయత్నం చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర నిరుడు సెప్టెంబర్ 14న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కొన్ని ప్రశ్నలు సంధించారు. వారు సమాధానం చెప్పకపోవడంతో సెప్టెంబర్ 15న బీజేపీ స్టింగ్ ఆపరేషన్ వీడియోలను బయటపెట్టడం, అదే రోజున మనీశ్ సిసోడియా ఇంటితో సహా దేశంలోని 31 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి.
ఆ తర్వాత నుంచి బీజేపీ ముఖ్యనేతలంతా ఎమ్మెల్సీ కవితపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ తప్పదని, జైలుకు వెళ్లడం ఖాయమని ఊదరగొట్టారు. ఈ క్రమంలోనే కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాలను బట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతల డైరెక్షన్లోనే పనిచేస్తున్నాయని, అందుకే గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ముందుగానే బీజేపీ నేతలకు లీక్ చేస్తున్నాయని అర్థమవుతున్నది.
ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందంటూ నిరుడు ఆగస్టులో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి ఏ రోజు ఏం జరుగుతుందో ముందుగానే బీజేపీ నేతలకు తెలిసిపోతున్నది. ఈ కేసులో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలు నిస్సిగ్గుగా బీజేపీ గల్లీ నేతలకు సమాచారాన్ని చేరవేస్తున్నాయి.
2022 ఆగస్టులో సీబీఐ దేశవ్యాప్తంగా 31 చోట్ల దాడులు నిర్వహించిన నాటి నుంచి మొన్న అరుణ్ రామచంద్ర పిైళ్లె అరెస్టు వరకూ ప్రతి విషయాన్ని బీజేపీ గల్లీ నేతలు పథకం ప్రకారం ముందుగానే మీడియాకు బహిర్గతం చేస్తున్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసింది. ఈ అరెస్టుల విషయాన్ని ఈడీ కంటే ముందుగానే చెప్పిన బీజేపీ నేతలు.. మున్ముందు మరిన్ని అరెస్టులు జరుగుతాయని చెప్తున్నారు. దీన్ని బట్టే బీజేపీకి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు మధ్య అక్రమ సంబంధం ఉన్నదని ప్రజలు నిర్ధారించుకుంటున్నారు.