కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో మరో కొత్త స్కామ్ చేరింది. అదే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ (వైఐఐఆర్ఎస్)కు సంబంధించిన టెండర్ల స్కామ్. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్లల్లో 5% వరకు అంచనాలు పెంచేందుకు అనుమతించారు. అంచనాలు పెంచిన సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో సర్కార్ పెద్దల పాత్ర ఉన్నదని, పెద్ద మొత్తంలో కమీషన్లు ఖరారయ్యాయన్న ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 79 యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) టెండర్లు ఆహ్వానించింది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారు. ఇందులో దాదాపు రూ.45 కోట్లు పన్నులు, చార్జీలకే వెళ్తుంది. అంటే నిర్మాణ వ్యయం రూ.155 కోట్లు మాత్రమే. అయితే, మొదట టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఏ సంస్థలూ ఆసక్తి చూపలేదు. పర్సంటేజీలు ఖరారుకాకపోవడంతోనే టెండర్లు దాఖలు కాలేదన్న ఆరోపణలున్నాయి. సంస్థలు రింగ్ అయ్యేందుకు ప్రయత్నించాయన్న వాదనలున్నాయి. ఆ తర్వాత మరోసారి టెండర్లు ఆహ్వానించారు. 10-15 సంస్థలు టెండర్లల్లో పాల్గొన్నాయి. అయితే, టెండర్ నిబంధనలను జాగ్రత్తగా రూపొందించారు. 5% లోపు మాత్రమే అంచనాలు పెంచుకునే అవకాశామిచ్చారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు కాంట్రాక్టర్లు 4.5% నుంచి 4.95% వరకు ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేశారు.
ఈ టెండర్ల పేరుతో దాదాపు రూ.వెయ్యికోట్లకుపైగా కొల్లకొట్టేందుకు సర్కార్ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేశారన్న ఆరోపణలొస్తున్నాయి. మొదట్లో ప్రభుత్వం వీటి నిర్మాణ వ్యయం రూ.80 కోట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత రూ.125 కోట్లుగా ఖరారు చేసింది. ఆ తర్వాత రూ. 200 కోట్లకు పెంచింది. అంటే ఒక్కో బడి నిర్మాణ వ్యయం రూ.75 కోట్లు పెరిగింది. దీంతో మొత్తం స్కూళ్ల నిర్మాణ వ్యయం రూ.5,700 కోట్లకు పెరుగగా, తాజా అంచనాల పెంపుతో మరో రూ.760 కోట్లు పెరుగనున్నది.
ఈ లెక్కన పెరిగిన అంచనాల మొత్తమే రూ.6,460 కోట్లకు చేరింది. ఈ అంచనాల పెంపు వెనుక ముఖ్యనేత సన్నిహితుల హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కమీషన్ల్లు కూడా ఖరారయ్యాయన్న ఆరోపణలొస్తున్నాయి. ఓ నేత ఇప్పటికే చక్రం తిప్పేశారట. దీంతోనే అడ్డగోలుగా అంచనాలు పెంచారని, తద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా కొల్లగొట్టేందుకు రంగంసిద్ధమైందన్న ప్రచారం జరుగుతున్నది. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరున్న విద్యాశాఖను అధికార పార్టీ నేతలు అక్షయపాత్రలా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యంగ్ ఇండియా స్కూళ్లను ప్రభుత్వం తన సొంత నిధులతో నిర్మించడంలేదు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి వేల కోట్లు అప్పు తెచ్చింది. వీటి నిర్మాణానికి రూ.8 వేల కోట్ల అప్పు కావాలని ప్రభుత్వం దరఖాస్తు చేయగా, ఏడీబీ ప్రస్తుతానికి రూ.4,200 కోట్లు మంజూరుచేసింది. మిగతా మొత్తాన్ని కూడా అప్పుగా తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ‘రాష్ర్టానికి వచ్చే ఆదాయం తగ్గింది. నన్ను కోసుకుతిన్నా రూపాయి లేదు. అప్పు కోసం వెళ్తే దొంగలాగా చూస్తున్నారు’ అని పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థ నుంచి అప్పు తేవాల్సిన అవసరమేమున్నది? ఈ ఆడంబరం దేనికి? అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇదంతా కమీషన్ల కోసమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలి. అప్పులు తేవాలి. అనుయాయులకు కట్టబెట్టాలి. వాటాలు పంచుకోవాలి. జేబులు నింపుకోవాలి’ అన్నట్టు సర్కార్ పెద్దలు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘మన ఊరు-మన బడి’ పెండింగ్ బిల్లుల విడుదలలోనూ భారీఎత్తన పంపకాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి బడా కంపెనీల బిల్లుల చెల్లింపు విషయంలో సర్కార్ పెద్దలు పెద్దఎత్తున కమీషన్లు పుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సంబంధించిన రూ.500 కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. వీటిలో బడా సంస్థలకు చెందినవి రూ.119 కోట్లున్నాయి. మిగతావన్నీ చిన్నచిన్న కాంట్రాక్టర్లవే. వీటిలో ఎక్కువ మొత్తం రూ.5 లక్షలోపు బిల్లులే ఉన్నాయి. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించని సర్కార్.. బడా కాంట్రాక్టర్లకు చెందిన రూ.119 కోట్లు చెల్లించింది. ఈ బిల్లుల కోసం కొందరు పెద్దలు 20% నుంచి 30% కమీషన్లు పుచ్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.